హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మ్యారియట్ హోటల్స్..హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
దేశంలో మొదటిసారిగా ఇక్కడే ఏర్పాటు చేయడానికి మ్యారియట్ ముందుకొచ్చిందన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చిలోగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. తొలి దశలో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మ్యారియట్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా టెక్ యాక్సిలరేటరి సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నదన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీ పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. అసలు కాలుష్యమే వెలువడని (జీరో పొల్యూషన్) పరిశ్రమలు ఉంటాయని చెప్పారు. కొద్దిపాటి రసాయన కాలుష్య వ్యర్థాలు ఉత్పత్తి అయినా ఆయా కంపెనీలే సొంత ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసుకుంటాయని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చేది తెలుస్తుందని ఆయన వివరించారు.