న్యూఢిల్లీ : మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’ ప్రధానంగా మారింది. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు దేనికైనా యూపీఐ యాప్‌ల ద్వారాడబ్బులు చెల్లించే వెసులుబాటు కలిగింది. యూపీఐ ద్వారా రోజూ కోట్ల రూపాయల్లో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, యూపీఐని అడ్డుపెట్టుకుని జరుగుతున్న కొన్ని మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. మరి ఆ మార్పులేంటో చూద్దామా..?
వాడకపోతే డీ యాక్టివేట్
గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ ఐడీలను ఏడాది కాలంగా వాడకపోతే తొలగిస్తామని ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ ప్రకటించింది. ఇలాంటి ఖాతాలతో మోసాలు జరగకుండా ఆపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే అవసరమైన వాళ్లు వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకునే సదుపాయం ఉన్నది.
లావాదేవీల పరిమితి పెంపు
యూపీఐ లావాదేవీల గరిష్ట రోజువారీ చెల్లింపు పరిమితిని NPCI లక్ష రూపాయలకు పెంచింది. అయితే విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఇంతకు ముందు ఈ లావాదేవీల పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది.
యూపీఐ ఏటీఎం
ఆర్బీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది. ఈ ఏటీఎంలతో మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్‌కు చెందిన హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేగాక ఇక నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా ఎవరికి డబ్బు పంపినా వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.