UPI QR | ఈ ఏడాది సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రిటైల్ షాపుల్లో యూపీఐ క్యూఆర్ లావాదేవీలు 33శాతం పెరిగాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని పేనియర్‌బై విడుదల చేసిన నివేదిక చెబుతున్నది. వ్యాపార రుణాలు, వ్యక్తిగత బంగారం రుణాలు, ఈ ప్రాంతాల్లో సులభ నిబంధనలపై రివాల్వింగ్ ఇచ్చిన రుణాలతో సహా రుణ ఉత్పత్తుల్లో 297శాతం పెరుగుదల నమోదైంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఆర్థిక, డిజిటల్ సేవలు అందిస్తున్న 10లక్షల కంటే ఎక్కువ చిన్న రిటైలర్ల నుంచి సేకరించిన వాస్తవ లావాదేవీల డేటా ఆధారంగా నివేదికను రూపొందించింది.
నివేదిక ప్రకారం.. బీమా పాలసీ కొనుగోలు, ప్రీమియం సేకరణ కోసం యూపీఐ క్యూర్ లావాదేవీల సంఖ్య ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 127 శాతం పెరిగింది. అలాగే, కొత్తగా 96శాతం వినియోగదారులు పెరిగారు. పేనియర్ బై ఎండీ-సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ బీమా, ఈ కామర్స్, రుణాలు తదితర సేవలు అందించేందుకు అవసరమైన సాధనాలను అందించడం ద్వారా స్థానిక రిటైలర్లకు సాధికారత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో ఏటీఎంలు, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS) నుంచి నగదు ఉపసంహరణలు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. అలాగే, పీఎం కిసాన్ వంటి పథకాల కింద నగదుల బదిలీ సమయంలో ఏఈపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణలు 35-45శాతం పెరిగాయి. జమ్మూ కాశ్మీర్లో నగదు విత్‌డ్రాలు 74 శాతం పెరిగాయి.