ముంబై, డిసెంబర్ 27: థర్డ్-పార్టీ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రీపెయిడ్ పేమెం ట్ ఇన్స్ట్రూమెంట్స్ (పీపీఐ) వినియోగదారులు యూపీఐ లావాదేవీలను జరుపుకొనేందుకు ఆర్బీఐ శుక్రవారం అనుమతిచ్చింది. థర్డ్-పార్టీ యాప్స్ (ఫోన్‌పే వంటివి)ను వినియోగించి పూర్తిస్థాయి కేవైసీ కలిగిన పీపీఐ (స్మార్ట్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్, మెట్రో రైల్ కార్డ్స్, ఆన్లైన్ అకౌంట్స్, డిజిటల్ వ్యాలెట్స్ వంటివి) హోల్డర్స్ యూపీఐ పేమెంట్స్ చేయడం లేదా స్వీకరించడానికి వీలు కల్పిస్తున్నట్టు సెంట్రల్ బ్యాంక్ ఓ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ప్రస్తుతం థర్డ్-పార్టీ యాప్స్‌తో తమ బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేసుకొని మాత్రమే యూపీఐ పేమెంట్స్‌ను కస్టమర్లు చేసుకోగలుగుతున్నారు.
కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాళంలోకి జారుకున్నది. ఇంట్రాడేలో 85.80 స్థాయికి పడిపోయిన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వుబ్యాంక్ అన్ని అస్ర్తాలను సంధించడంతో చివర్లో ఈ భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకోవడం రూపాయి పతనానికి అడ్డుకట్టవేసింది.
85.31 వద్ద ప్రారంభమైన డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 53 పైసలు కుంగి చారిత్రక కనిష్ఠ స్థాయి 85.80కి జారుకున్నది. సెంట్రల్‌బ్యాంక్ జోక్యంతో భారీ నష్టాల నుంచి కోలుకొని చివరకు 21 పైసల నష్టంతో 85.48 వద్ద ముగిసింది. గడిచిన రెండేండ్లలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2, 2023న రూపాయి విలువ అత్యధికంగా 68 పైసలు పడిపోయిన విషయం తెలిసిందే.