UPI | ముంబై, ఆగస్టు 15: బ్యాంక్ ఖాతా లేకున్నా.. మొబైల్స్‌లో ఆన్లైన్ పేమెంట్స్‌ను చేసుకునే సౌకర్యం రానున్నది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీస్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నది మరి. ఇటీవలి ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించినట్టుగానే యూపీఐ సేవల్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టే దిశగా ఎన్పీసీఐ అడుగులేస్తున్నది. ఇందులో భాగంగానే కొత్తగా డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్‌ను పరిచయం చేస్తున్నది.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్.. బ్యాంక్ ఖాతాదారులకే అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్ పే ఇలా ఏ యూపీఐ సర్వీస్‌ను వాడాలన్నా.. బ్యాంక్ ఖాతా తప్పనిసరి. వినియోగదారుల బ్యాంక్ ఖాతాలకు వారి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకైతేనే యూపీఐ అకౌంట్స్ యాక్టీవేట్ అయ్యేవి. అయితే ఇకపై బ్యాంక్ ఖాతా లేనివారూ తమ మొబైల్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసుకునేలా ఓ నయా డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్‌ను ఎన్పీసీఐ తీసుకువస్తున్నది. యూపీఐ అకౌంట్ ఉన్న వ్యక్తి అనుమతితో వారి కుటుంబ సభ్యులు, ఇతరులు బ్యాంక్ ఖాతా లేకున్నా.. ఆన్లైన్ పేమెంట్స్ చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త సిస్టమ్ కల్పిస్తున్నది.
ఓ కుటుంబంలో బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి యూపీఐ పేమెంట్స్‌ను వాడుతున్నారు. అప్పుడు మిగతా కుటుంబ సభ్యులూ అదే యూపీ అకౌంట్‌కు తమ మొబైల్ ఫోన్లను లింక్ చేసుకుని సదరు బ్యాంక్ ఖాతా నుంచే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీన్నె డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ అంటారు. అయితే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్దారులకే ఈ అవకాశం ఉన్నది. క్రెడిట్ కార్డులు, ఇతర ఆర్థిక సాధనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన విధివిధానాలను ఎన్పీసీఐ త్వరలో ప్రకటిస్తుంది. దీనివల్ల యూపీఐ ద్వారా చెల్లింపులు మరో 25 నుంచి 30 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఖాతా లేనివారు ఇప్పటికీ నగదు లావాదేవీలపైనే ఆధారపడుతున్నారు. వారినీ డిజిటల్ ఎకానమీలో భాగస్వాముల్ని చేయడానికి డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ దోహదపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌నూ పరిచయం చేయాలని ఎన్పీసీఐ చూస్తున్నది.