Hallmark | న్యూఢిల్లీ, జనవరి 6 : వెండిపై కూడా హాల్‌మార్కింగ్‌కు సిద్ధమవుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే బంగారు, ఆభరణాలపై హాల్‌మార్కింగ్ విజయవంతంగా పూర్తికావడంతో కన్జ్యూమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌తో వెండితోపాటు వెండి కళాఖండాలపై కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో వీటిపై కూడా హాల్‌మార్కింగ్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) అమలు చేయాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోష్ సూచించారు. వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా వస్తున్నదని, దీనిని వెంటనే అమలులోకి తేవాలని 78వ బీఐఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఈ దిశగా పనులు ప్రారంభమయ్యాయని, బీఐఎస్ ద్వారా వాటాదారులతో సంప్రదింపులు, సాధ్యాసాధ్యాలపై పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.
వెండిపై హాల్‌మార్కింగ్‌పై వాటాదారుల నుంచి, అటు కన్జ్యూమర్, ఆర్నమెంట్ డీలర్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని బీఐఎస్‌కు మంత్రి సూచించారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఆభరణాల్లో 90 శాతం హాల్‌మార్కింగ్ కలిగినవని, 44.28 కోట్ల బంగారు ఆభరణాలు హాల్‌మార్కింగ్‌తో తయారైనవి అమ్ముడయ్యాయని మంత్రి చెప్పారు. దీనిపై బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ..వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో వెండిపై హాల్‌మార్కింగ్‌ను అమలులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వెండి నాణ్యతను గుర్తించే విధానంపై ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిపినట్లు, ఆరు డిజిట్ అల్ఫాన్యూమెరిక్ కోడ్ కలిగిన నంబర్‌ను ప్రింటింగ్ వేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. జూన్ 2021లో ప్రవేశపెట్టిన గోల్డ్ హాల్‌మార్కింగ్ విజయవంతంగా అమలు చేయబడుతున్నదని, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 361 జిల్లాలను కవర్ చేయగలిగామన్నారు.