Piyush Goyal | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నందున ఇక వడ్డీరేట్ల కోతల దిశగా ఆర్బీఐ నిర్ణయాలుంటాయన్న ఆశాభావాన్ని సోమవారం ఇక్కడ వెలిబుచ్చారు.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి రెపోరేటును 6.5 శాతం వద్దే ఆర్బీఐ ఉంచుతున్న విషయం తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని, దేశ ఆర్థిక మూలాలు సైతం బలంగా ఉన్నాయని గోయల్ అన్నారు. కాగా, రెపోరేటు తగ్గితే అటు కార్పొరేట్ రుణాలు, ఇటు వ్యక్తిగత రుణాలపై వడ్డీభారం దిగిరానున్నది. దీనివల్ల ఈఎంఐలు తగ్గుతాయి. ఏప్రిల్ 5న తదుపరి ద్రవ్యసమీక్ష నిర్ణయాలు రానున్నాయి. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదైంది.