న్యూఢిల్లీ, జూలై 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికిగాను రూ.1,558.46 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని ఆర్జించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,180.98 కోట్ల లాభంతో పోలిస్తే 32 శాతం అధికమని బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతోపాటు సమీకృత వడ్డీ ఆదాయం పెరగడం లాభాల్లో వృద్ధికి కలిసొచ్చిందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి బ్యాంక్ రూ.20,991 కోట్ల ఆదాయాన్ని గడించింది. కోర్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.17,134.23 కోట్ల నుంచి రూ.18,174.24 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. మరోవైపు, బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 13.60 శాతం(రూ.87,762.19 కోట్లు) నుంచి 10.22 శాతానికి(రూ.74,500 కోట్లు)కు తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 4.69 శాతం (రూ.27,437.45 కోట్లు) నుంచి 3.31 శాతానికి(రూ.22,391.95 కోట్లకు) తగ్గింది.