TVS Motor | ఇటీవల భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ కొత్త కొత్త ఈవీ వెహికిల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు పోటీపడుతున్నాయి. దేశీయ ప్రముఖ కంపెనీ అయిన టీవీఎస్ మోటార్ సైతం కొత్తగా క్రియోన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నది. ఈ స్కూటర్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఈ నెల 23న దుబాయిలో జరిగే ఓ కార్యక్రమంలో టీవీఎస్ మోటర్స్ క్రియాన్ ఎలక్ట్రికల్ వెహికల్‌కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేయనుంది.
ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ఏథర్ 450ఎస్, ఓలా ఎస్-1 ఎయిర్‌తో పోటీపడనున్నది. క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో LED హెడ్‌లైట్, షార్ప్ ఆప్రాన్ ప్యానెల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. ఈ వెహికల్‌ను స్మార్ట్ వాచ్‌కు లింక్ చేసే అవకాశాన్ని వాహనదారులకు టీవీఎస్ మోటార్స్ కల్పించింది. దీంతో స్కూటర్‌ను లాక్, అన్‌లాక్‌ను స్మార్ట్‌వాచ్‌లోని యాప్ ద్వారా చేయవచ్చని తెలిపింది. అయితే, ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు.
స్కూటర్ కేవలం 5.1 సెకండ్ల వ్యవధిలోనే జీరో నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుందని టీవీఎస్ పేర్కొంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అదే విధంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెళుతుందని కంపెనీ ప్రకటించింది. అయితే, క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ మోటార్స్ దసరా, దీపావళి సీజనల్లో మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.