Truecaller AI Scanner | సాధారణ వ్యక్తులను బురిడీ కొట్టించేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగానే మోసాలు జరుగుతున్నాయి. మనకు తెలిసిన బంధువు లేదా మిత్రుడి వాయిస్‌తో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసే మోసగాళ్లు.. కంగారుగా మాట్లాడతారు. తన ఫోన్ పోయిందని, దవాఖానాలో అడ్మిట్ అయ్యానని, ఎమర్జెన్సీగా డబ్బు కావాలని చెబుతుంటారు. ఫోన్ కాల్ పూర్తి కాగానే ఏమాత్రం ఆలోచించకుండా సదరు ఫోన్ నంబర్‌కు మనీ పంపేస్తారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సామాన్య వ్యక్తుల వాయిస్ క్లోన్ చేసి మోసాలు చేస్తున్నారు. అలా మోసపోయిన సంగతి బాధితులకు ఆలస్యంగా తెలుస్తున్నది. ఇటువంటి మోసాలకు తెర దించేందుకు ట్రూకాలర్ యాప్ ఏఐ సాయంతో కొత్త ఫీచర్ తెచ్చింది.
ఏ కాల్ వచ్చినా సదరు వాయిస్ ‘ఏఐ సాయంతో జనరేట్ చేశారా.. లేదా’ అన్న సంగతి కొన్ని క్షణాల్లోనే ఈ ఫీచర్ తేల్చేస్తుంది. అందుకోసం కొన్ని క్షణాలు ఆ వాయిస్ రికార్డు చేసి విశ్లేషిస్తుంది. దీని కోసం సొంతంగా ఏఐ మోడల్ వినియోగించామని ట్రూకాలర్ వెల్లడించింది. సోషల్ మీడియాలోని వీడియోలతోపాటు కొందరు వ్యక్తుల వాయిస్ వాడినట్లు పేర్కొంది.
ఏఐ స్కామ్ కాల్స్ గుర్తించడానికి ట్రూ కాలర్ యాప్‌ను డిఫాల్ట్ కాలర్ యాప్‌గా సెట్ చేసుకోవాలి. అనుమానాస్పద కాల్ వస్తే స్టార్ట్ డిటెక్షన్ మీద క్లిక్ చేస్తే రికార్డు చేసిన క్షణాల్లో విశ్లేషించి ఫలితాన్ని నోటిఫికేషన్ ద్వారా చెబుతుంది. తొలుత అమెరికాలోని ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తెస్తున్నట్లు ట్రూ కాలర్ తెలిపింది. ఈ ఫెసిలిటీని త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్లలోకి అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.