అన్ని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, వివిధ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, రిజిస్ట్రార్స్, పోస్టాఫీస్ వర్గాలు, క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థల వంటివి ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీన్నే ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ అంటారు. ఇందులో ట్యాక్స్‌పేయర్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటి వివరాలనూ ఆయా సంస్థలు పేర్కొంటాయి. ఇక పాన్ ఆధారిత సమాచారం.. మీరు చేసే ఆర్థిక కార్యకలాపాలు ఏవైనా పన్ను ఎగవేతలకు దారితీస్తున్నాయా? అన్న కోణంలో ఐటీ శాఖ అధికారులకు నిఘా పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. పరిమితికి మించి మీరు చేసే ప్రతీ లావాదేవీకి పాన్‌ను వినియోగించాల్సిందేనన్నది తెలిసిందే. దీంతో ఐటీ శాఖ పరిశీలిస్తున్నప్పుడు ఎస్ఎఫ్టీలో అవకతవకలు కనిపిస్తే.. సదరు ట్యాక్స్‌పేయర్స్‌కు తాఖీదులు తప్పవు.
ఉదాహరణకు.. ఐటీ రిటర్న్స్‌లో ఓ వ్యక్తి వార్షిక ఆదాయం రూ.2 లక్షలుగా చూపుతున్నప్పుడు, అదే వ్యక్తి రూ.14 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసినట్టు ఐటీ శాఖ స్క్రూటినీలో గుర్తిస్తే అది ఆందోళనకరమే. బంగారం కొనేందుకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఆదాయాలు దాస్తే..
ట్యాక్స్‌పేయర్ తన ఐటీ రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయానికి, ఎస్ఎఫ్టీ ద్వారా నివేదించబడిన లావాదేవీలు, ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లో ఉన్న సమాచారాలకు పొంతన కుదరకపోవడాన్ని ఐటీ శాఖ గుర్తిస్తే నోటీసులు వస్తాయి. దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోతే జరిమానాలు, జైలుశిక్షలు ఖాయం. మీరు ఉద్దేశపూర్వకంగానే రూ.25 లక్షలకు మించి పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు రుజువైతే కనిష్ఠంగా 6 నెలలు, గరిష్ఠంగా 7 ఏండ్ల కఠిన కారాగారం తప్పదు. జరిమానా కూడా ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే కనిష్ఠంగా 3 నెలలు, గరిష్ఠంగా 2 ఏండ్ల జైలుశిక్ష, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జరిమానాలను 50 శాతం నుంచి 200 శాతం వరకు విధించే వీలున్నది.
ఎస్ఎఫ్టీల్లో ఈ లావాదేవీలు..