Total Energies – Adani Group | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలకు గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్‌పై అమెరికా కోర్టులో కేసు తేలేంత వరకూ ఆ గ్రూప్ సంస్థల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని ఫ్రాన్స్ విద్యుత్ తయారీ సంస్థ ‘టోటల్ ఎనర్జీస్’ సోమవారం ప్రకటించింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ గత సెప్టెంబర్ లో 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థలో తమ హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని టోటల్ ఎనర్జీస్ తెలిపింది.
‘అమెరికా కోర్టులో అభియోగాల్లో నిజానిజాలపై టోటల్ ఎనర్జీస్ భాగస్వామి కావడం గానీ, లక్ష్యంగా చేసుకోవడం గానీ చేయలేదు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)లో మైనారిటీ వాటాదారు (19.75 శాతం), ఏజీఈఎల్ జాయింట్ వెంచర్లో 50 శాతం వాటాదారుగా మా హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం’ అని టోటల్ ఎనర్జీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2021 జనవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75 శాతం వాటా కొనుగలు చేసింది. 2020లో ఏజీఈఎల్ 23, 2023లో ఏఆర్‌ఈఎల్9, 2024లో ఏఆర్‌ఈఎల్64 అనే జాయింట్ వెంచర్ సంస్థల్లో టోటల్ ఎనర్జీస్ 50 శాతం వాటా కలిగి ఉంది.