IT | న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారతీయ టెక్నాలజీ ఇండస్ట్రీ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. 7 ప్రధాన హబ్‌ల నుంచి 26 నగరాలుగా రూపాంతరం చెందుతున్నదని డెలాయిట్, నాస్కామ్ తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె హబ్‌లుగా దేశీయ ఐటీ ఇండస్ట్రీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే సాంకేతిక ప్రతిభావంతుల్లో చండీగఢ్, నాగ్‌పూర్, కాన్పూర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందినవారు దాదాపు 11-15 శాతం ఉండటంతో ఐటీ కంపెనీల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏడు మేజర్ హబ్‌లు కాస్తా.. 26 సిటీస్‌గా మారిపోతున్నాయని ‘ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో విడుదలైన తమ 220 పేజీల నివేదికలో డెలాయిట్, నాస్కామ్లు తెలిపాయి.
60 శాతం అక్కడివారే..
ప్రధాన రంగాల్లో దాదాపు 60 శాతం గ్రాడ్యుయేట్లు చిన్న నగరాల నుంచే వస్తున్నారని ఈ సందర్భంగా రిపోర్టు పేర్కొన్నది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఉపాధి కోసం ప్రథమ శ్రేణి నగరాలకు మారుతున్నవారు 30 శాతంగా ఉన్నారన్నది. ఈ క్రమంలోనే తర్వాతి ఐటీ హబ్‌లుగా చండీగఢ్, కాన్పూర్, అహ్మదాబాద్, మంగళూరు, నాగ్‌పూర్ వంటి నగరాలు ఎదుగుతున్నాయని డెలాయిట్, నాస్కామ్ వివరించాయి. ఫలితంగా ప్రతిభావంతులకు తగిన అవకాశాలు ఇక్కడే లభిస్తున్నాయని, పైగా ఈ నగరాల్లో కార్యకలాపాల నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటున్నదని చెప్పాయి. ఇక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన పరంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు కూడా వస్తుండటంతో కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలను తెరుస్తున్నాయని వెల్లడించాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, డబ్ల్యూఎన్ఎస్ తదితర కంపెనీలు ఈ ఎమర్జింగ్ హబ్‌ల్లో ఒకటి, అంతకుమించి నగరాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నాయని కూడా డెలాయిట్, నాస్కామ్ గుర్తుచేశాయి. భారతీయ ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం 54 లక్షల మంది ఉద్యోగులున్నారు.
స్టార్టప్‌లకూ కేంద్రం
ఐటీ కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్న దేశంలోని ఆయా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్‌లూ పెద్ద ఎత్తునే పుట్టుకొస్తున్నాయి. డీప్‌టెక్ నుంచి బీపీఎం సేవల వరకు ఆయా రంగాల్లో ఈ ఎమర్జింగ్ హబ్‌ల్లో 7వేలకుపైగా స్టార్టప్‌లున్నాయి. 2025కల్లా మరో 2.2 శాతం పెరగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఏడాది దేశీయ స్టార్టప్‌లకు అందిన ఫండింగ్‌లో 13 శాతం ద్వితీయ శ్రేణి నగరాలకు చెందిన స్టార్టప్‌లకు వచ్చినదే.