Auto Sales | న్యూఢిల్లీ, నవంబర్ 1: ఆటో రంగ సంస్థలకు ఈసారి పండుగ సీజన్ పెద్దగా కలిసిరాలేదు. దేశీయ మార్కెట్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగాయి మరి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ నిరుడు అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 10వేల యూనిట్ల మేర తక్కువగా విక్రయాలను చేయగలిగింది. చిన్న కార్లలో పాపులర్ మాడైళ్లెన ఆల్టో, ఎస్-ప్రెస్సోకు ఆదరణ కరువవడం, కాంపాక్ట్ కాైర్లెన బాలెనో, సెలీరియో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్ తదితర మాడళ్లకూ గిరాకీ తగ్గడం దెబ్బతీసింది. అయితే ఎగుమతులు భారీగా జరిగాయని సంస్థ ప్రకటించింది. ఎగుమతులను కూడా కలుపుకొంటే మునుపెన్నడూ లేనివిధంగా గత నెల 2,06,434 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి.
గత ఏడాది ఇదే నెలతో చూస్తే 4 శాతం ఎక్కువ. ఇక హ్యుందాయ్ ఫర్వాలేదనిపించినా.. టాటా మోటర్స్, హోండా కార్స్ అమ్మకాలు నిరాశపర్చాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఎంజీ మోటర్ వాహన అమ్మకాలు మాత్రం అదరగొట్టాయి. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 18 శాతం ఎగబాకాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ 26 శాతం వృద్ధిని కనబర్చింది. టీవీఎస్ సైతం ఆకట్టుకున్నది.
గత నెలలో 41,605 వాహనాలను అమ్మినట్టు విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తెలియజేసింది. గతంతో పోల్చితే విక్రయాలు 74 శాతం పెరిగాయని పేర్కొన్నది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో గిరాకీ పెరిగినట్టు సంస్థ చెప్పింది.