WFH permanent in PWC | అమెరికాలోని తమ 40 వేల మంది క్లయింట్ సర్వీస్ ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుంచి పని ( Work from Home ) చేసేందుకు అనుమతించినట్లు ప్రముఖ అకౌంటింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ వెల్లడించింది. అకౌంటింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగులకు రాత్రి పొద్దుపోయే వరకు పనులు ఇచ్చే ధోరణికి కరోనా మహమ్మారి చెక్ పెట్టిందనే చెప్పాలి. డెల్లాయిట్, కేపీఎంజీ వంటి ప్రధాన అకౌంటింగ్ సంస్థలు కరోనా వేళ ఇండ్ల వద్ద నుంచి పని చేయడానికే తమ ఉద్యోగులకు చాన్స్ ఇచ్చాయి.
అకౌంటింగ్ ఇండస్ట్రీలోనే క్లయింట్ సర్వీస్ ఉద్యోగులు పూర్తిగా ఇంటి వద్ద నుంచి పని చేసేందుకు అవకాశం కల్పించిన తొలి సంస్థ అని పీడబ్ల్యూసీ డిప్యూటీ పీపుల్ లీడర్ యొలందా సీల్స్ కోఫీల్డ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులు వారంలో గరిష్ఠంగా మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.
క్లయింట్లతో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూలు, కీలక టీం సమావేశాలు, క్లయింట్ విజిట్స్, లెర్నింగ్ సెషన్స్‌కు హాజరు కావాలని యొలందా సీల్స్ కోఫీల్డ్ తెలిపారు. అయితే, వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల వేతనాల్లో కోత ఉంటుందని, వారి నివాస ప్రాంతాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందన్నారు.
అల్ఫాబెట్ ఇంక్ గూగుల్ సైతం శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల నివాస ప్రాంతాన్ని బట్టి వేతనాలు తగ్గిస్తున్నది. గతేడాది మార్చి నుంచి కరోనా నుంచి బయటపడేందుకు అమెరికాలోని కంపెనీల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారు.
పీడబ్ల్యూ రీసెర్చ్ ప్రకారం 30-35 శాతం మంది ఉద్యోగులు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులని తేలింది. అమెరికాలో 55 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు మెజారిటీ సభ్యులు కోరుకుంటే వర్క్ ఫ్రం హోం సేవలందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఐదేండ్లలో లక్ష మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు గత జూన్‌లో పీడబ్ల్యూసీ వెల్లడించింది. బ్రిటన్‌లోనూ 20 వేల మంది ఉద్యోగుల్లో ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి పని చేసేందుకు ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 2.84 లక్షల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు.