Banking Payments | ఈ రోజు (అక్టోబర్ 1) నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ లావాదేవీలు, చెల్లింపులు, షేర్మార్కెట్లలో ట్రేడింగ్ తదితర అంశాల్లో సమూల మార్పులు ప్రారంభం అయ్యాయి. మారిన ఈ రూల్స్‌తో మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపనున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
శుక్రవారం నుంచి బ్యాంకింగ్ లావాదేవీల్లో.. ప్రత్యేకించి డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ వాలెట్ల నుంచి ఆటో డెబిట్ రూల్స్ మారిపోయాయి. ఆటో డెబిట్ పేమెంట్స్ కోసం ఆర్బీఐ అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) తెచ్చింది. రూ.5,000 లోపు చెల్లింపులపై ముందస్తుగా బ్యాంకుకు మీ అథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రూ.5,000 దాటిన పేమెంట్స్ కోసం ఓటీపీ నమోదు చేయాలి.
అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు జారీ చేసిన చెక్‌బుక్‌లు చెల్లవు. ఈ బ్యాంకుల ఖాతాదారులు తమ శాఖలకు వెళ్లి న్యూ చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి.
వివిధ బ్యాంకుల్లో డీ-మ్యాట్ ఖాతాలు గల ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు కేవైసీ పత్రాలు సమర్పించాలని ఇంతకుముందు సెబీ ఆదేశించింది. ఒకవేళ సకాలంలో మీరు కేవైసీ పత్రాలు సమర్పించకుంటే మీ డీ-మ్యాట్ ఖాతా సస్పెండ్ చేస్తారు. దీంతో మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయలేరు. మీరు కేవైసీ పత్రాలు సమర్పించే వరకు సంబంధిత బ్యాంకు మీ ఖాతాను యాక్టివేట్ చేయదు.
స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే ఖాతాదారులు.. తమ డీ-మ్యాట్ ఖాతాల్లోనూ. . ట్రేడింగ్ పత్రాల్లో తమ నామినీ ఫేరును ఖరారు చేసింది సెబీ. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం ఇష్టం లేనివారు డిక్లరేషన్ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. పాత డీ-మ్యాట్ ఖాతాదారులు వచ్చే మార్చి నెలాఖరులోగా డిక్లరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలి.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల లావాదేవీలపై ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటి నుంచి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు వినియోగదారులకు జారీ చేసే బిల్లులపై తమ లైసెన్స్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ నిబంధనను పాటించని వారి వ్యాపార లైసెన్స్ రద్దు చేస్తారు.