Credit Card | ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు, ఆన్ లైన్ కొనుగోళ్లు.. క్రెడిట్ కార్డులపై ఈ-కామర్స్ సంస్థల ద్వారా కొనుగోళ్లు జరిపితే డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. క్రెడిట్ కార్డు ఉన్నదని ఇష్టారాజ్యంగా వాడకుండా సరిగ్గా వాడుకుంటే పలు బెనిఫిట్లు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. బాధ్యతతో ఖర్చు చేస్తే మంచి క్రెడిట్ హిస్టరీ నిర్మించుకోవడం తోపాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డుల వాడకంలో తలెత్తే సందేహాలకు ఆర్బీఐ కొన్ని జవాబులు ఇచ్చింది.
కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు సంస్థలు క్రెడిట్ కార్డులు జారీ చేయాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకోకున్నా, క్రెడిట్ కార్డు జారీ చేస్తే దాన్ని యాక్టివేట్ చేయొద్దు. ఖాతాదారుల అభ్యర్థన మేరకు ఏడు రోజుల్లో ఆ కార్డును మూసేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సమాచారం ఇస్తే కస్టమర్ తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డును ధ్వంసం చేయాల్సి ఉంటుంది. సాధారణ క్రెడిట్ కార్డు యూజర్లతో పోలిస్తే బిజినెస్ క్రెడిట్ కార్డుల యాక్టివేషన్ లేదా క్లోజర్ కు ముందు తప్పనిసరిగా సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థలు సమాచారం ఇవ్వాలి. యాడ్ ఆన్ కార్డులను మూసేయాలని సంబంధిత యూజర్ల అభ్యర్థన చేసినా, ప్రధాన క్రెడిట్ కార్డు దారుడికి తెలియజేయాల్సి ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలే కాక స్టేట్ మెంట్ తీసుకున్నా, పిన్ నంబర్ మార్చినా, లావాదేవీల లిమిట్ సవరించినా కార్డు వాడుతున్నట్లే పరిగణిస్తారు. ఇతర కారణాలతో సంబంధిత క్రెడిట్ కార్డు జారీ సంస్థ కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే దాని వాడుతున్నట్లు పరిగణనలోకి తీసుకోరు.
క్రెడిట్ కార్డు వాడకంపై కొంత లిమిట్ ఉంటది. కస్టమర్ల అనుమతితో దాన్ని మించి వాడుకునే ఆప్షన్ సంబంధిత క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇవ్వవచ్చు. కానీ కస్టమర్ కు తెలియకుండా అదనపు పరిమితి అనుమతించడం, దానిపై చార్జీలు వసూలు చేయడం అనుమతించరు. క్రెడిట్ కార్డుపై యాడ్ ఆన్ కార్డులను తీసుకునే వెసులుబాటు ఉంటది. ఆ యాడ్ ఆన్ కార్డుల బకాయిలు చెల్లించే బాధ్యత కూడా ప్రధాన క్రెడిట్ కార్డు కస్టమర్దే అవుతుంది. బిజినెస్ క్రెడిట్ కార్డులు తీసుకుంటే.. సంబంధిత భాగస్వాముల మధ్య ఒప్పందాల మేరకు విభజించుకునే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డుల కస్టమర్లు తప్పనిసరిగా బీమా తీసుకోవాలనే నిబంధన లేదు. కానీ తమ కస్టమర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని సంస్థలు భావిస్తే మాత్రం నామినీతోపాటు బీమా వివరాలు ప్రతి స్టేట్మెంట్లోనూ తప్పనిసరిగా ఇవ్వాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఎమర్జెన్సీలో సంప్రదించేందుకు ఫోన్ నంబర్ ఇవ్వాలి.
ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువగా ఉండొచ్చు. సకాలంలో బిల్లు చెల్లించకుంటే వడ్డీ రహిత గడువు బెనిఫిట్ పొందలేరు. కనీస మొత్తం చెల్లిస్తే, మిగతా మొత్తం బిల్లు వాడకం దగ్గర నుంచి వడ్డీ చెల్లించాలి. ఇతర ఫీజులు కూడా బకాయిలకే వర్తిస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లింగ్-సైకిల్ తేదీ మార్చుకునేందుకు సంబంధిత క్రెడిట్ కార్డు వాడకం దారులకు సంస్థలు ఒకసారి ఆప్షన్ ఇవ్వాలి. హెల్ప్ లైన్, ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పా్న్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా బిల్లు సైకిల్ మార్పు కోసం అప్పీల్ చేయొచ్చు.