Home loans | న్యూఢిల్లీ, మే 11: దేశవ్యాప్తంగా గృహ రుణాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ఒకవైపు వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా 2022లో 34 లక్షల గృహ రుణాలను మంజూరు చేశాయి బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు. వీటి విలువ రూ.9 లక్షల కోట్లని ఈక్విఫాక్స్ అండ్ ఆండ్రోమేదా సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రూ.25 లక్షల కంటే తక్కువ రుణాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో గృహ రుణాల మంజూరు 18 శాతం పెరగగా..తీసుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగారని ‘ఇండియన్ రిటైల్ లోన్ రివ్యూ-ఏప్రిల్ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ నెలకొన్నదని, ముఖ్యంగా సులభంగా రుణాలు లభిస్తుండటం ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది.