న్యూఢిల్లీ, జనవరి 4: బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అందుకుంటున్న ఫిర్యాదుల్లో అధిక భాగం ఏటీఎం/డెబిట్ కార్డులు, మొబైల్, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించినవేనని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. బ్యాంకింగ్ సేవల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 నవంబర్ 11 మధ్యకాలంలో అందిన మొత్తం ఫిర్యాదుల్లో ఏటీఎం/డెబిట్ కార్డులపై ఫిర్యాదులు అత్యధికంగా 14.65 శాతం ఉన్నాయని, మొబైల్/ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు 13.64 శాతమని ఆర్బీఐ వివరించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో అంబుడ్స్‌మన్ కార్యాలయాలకు 4,18,184 ఫిర్యాదులు వచ్చాయని, అంతక్రితం ఏడాదికంటే 9.39 శాతం పెరిగినట్టు తెలిపింది. ఫిర్యాదుల్లో 90 శాతం వరకూ ఆన్లైన్ కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్, ఈమెయిల్, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రెస్ మానిటరింగ్ సిస్టమ్‌ల ద్వారా డిజిటల్ మోడ్‌లో అందాయని వెల్లడించింది.