Credit Cards | సాయి ప్రవీణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్.. అంతే కాదు పేరొందిన ఐటీ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు.. ఆయన వేతనం ఐదంకెల్లోనే.. ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు క్రెడిట్ కార్డులను వాడుతున్నాడు. ఈ కార్డులన్నింటిపైనా వచ్చే నెలవారీ బిల్లులన్నీ క్రమం తప్పకుండా.. డెడ్‌లైన్‌లోపే పే చేస్తారు. అయినా ఒక్కరికి ఐదు క్రెడిట్ కార్డులు అవసరమేనా.. అన్న చర్చ సాగుతున్నది. అసలు క్రెడిట్ కార్డులు ఎన్ని వాడొచ్చు.. అలా వాడటం వల్ల తలెత్తే ఇబ్బందులేమిటి.. బెనిఫిట్లు తెలుసుకుందామా.. !
ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డులు వాడాలన్న విషయమై ఎటువంటి ప్రమాణాలు లేవని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్శెట్టి పేర్కొన్నారు. మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు కావాలనుకున్నా తీసుకోవచ్చుననంటున్నారు. అందులో తప్పొప్పుల ఊసే లేదన్నారు. ఆయా క్రెడిట్ కార్డులన్నీ బాధ్యతాయుతంగా వాడుకోవడం తెలివైన పని అంటున్నారు.
సదరు క్రెడిట్ కార్డుల అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత నెలవారీ ఖర్చులపై స్పష్టమైన అకౌంట్ ఖరారు చేసుకోవాలంటున్నారు. మీ ఖర్చులను ఏయే క్రెడిట్ కార్డులు ఆదా చేస్తాయో తెలుసుకోవాలని అదిల్శెట్టి చెప్పారు. క్రెడిట్ కార్డుల వాడకంపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఫెసిలిటీ, స్పెషల్ ఆఫర్లు లభిస్తాయి. ఆ బెనిఫిట్లు సజావుగా వాడుకున్న వారి జీవితం కూడా సాఫీగా సాగిపోతుందంటారు అదిల్ శెట్టి. ఆ క్రెడిట్ కార్డుల వాడకంలో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడుతూ వాటిపై పూర్తి బెనిఫిట్లను పొందాలని భావిస్తే.. ప్రతి నెలా ప్రతి క్రెడిట్ కార్డు బిల్లు పూర్తిగా చెల్లించాల్సిందేనని చెప్పారు అదిల్ శెట్టి. అలా చేయలేకపోతే.. క్రెడిట్ కార్డు వాడకం దారుల ఖర్చులపై వడ్డీ వడ్డిస్తాయి సదరు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు. వడ్డీ భారం పెరిగిపోవడంతో సదరు క్రెడిట్ కార్డుల వాడకంతో పొందిన బెనిఫిట్లకు విలువ లేకుండా పోతుందని స్పష్టం చేశారాయన.
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం, ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయొద్దని అదిల్ శెట్టి చెప్పారు. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినా.. రుణం కోసం అప్లికేషన్ సబ్మిట్ చేసినా.. ప్రతి సారీ బ్యాంకులు సదరు వ్యక్తుల క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తాయి. అలా సిబిల్ స్కోర్ ప్రతిసారీ తప్పనిసరిగా చెక్ చేస్తుండటంతో మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం కూడా ఉంది.
ప్రతి క్రెడిట్ కార్డుపైనా వేర్వేరు బెనిఫిట్లు పొందొచ్చు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు అవసరమా.. లేదా.. అని తేల్చుకోవాలి. ఫ్యూయల్ క్రెడిట్ కార్డు పొందలేకపోతే ఎక్కువ దూరం వెహికల్‌పై ప్రయాణం చేయలేరు. ఒకసారి క్రెడిట్ కార్డు తీసుకుంటే రెగ్యులర్‌గా దాన్ని వాడుతూనే ఉండాలి. క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత ఏడాదికి పైగా వాడకపోతే దాన్ని సంబంధిత బ్యాంక్ డీ-యాక్టివేట్ చేస్తుంది.
క్రెడిట్ కార్డుల్లో రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఎయిర్‌మైల్స్ కార్డులు ఫ్రీగా విమాన ప్రయాణ టికెట్లు వంటి బెనిఫిట్లు పొందడానికి ఉపకరిస్తాయి. ఈ-కామర్స్ షాపింగ్‌లో క్యాష్‌బ్యాక్.. కొన్ని కార్డులతో నో-కాస్ట్ ఈఎంఐ కింద వస్తువులు కొనుగోలు చేయొచ్చు.. క్రూడాయిల్ ధరకు అనుగుణంగా భారీగా పెరిగిన పెట్రోల్ ధర ప్రభావం తగ్గించుకోవడానికి..పెట్రోల్ రివార్డులు పొందడానికి ఫ్యూయల్ క్రెడిట్ కార్డు ఉపకరిస్తుంది.