IT Returns | న్యూఢిల్లీ, మే 27: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ చెల్లింపులు గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో అసెస్మెంట్ ఏడాది (ఏవై) 2025-26కిగాను జూలై 31 వరకు ఉన్న గడువును మరో నెలన్నర పెంచినట్టు అయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐటీఆర్‌లో మార్పులు చోటు చేసుకోవడం, యుటిలిటీ వ్యవస్థ అమలుకు అవసరమైన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఐటీ గడువును పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి ఐటీ శాఖ నిరంతరంగా కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగానే ఐటీ ఫామ్‌లో పలు మార్పులు చేసింది.
ఈ నోటిఫై చేసిన ఐటీ ఫామ్‌తో చెల్లింపుదారులు సులభతరంగా, పారదర్శకతను పెంచడం, ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో సీబీడీటీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ ఆలస్యం కావడమే ఇందుకు కారణమని తెలిపింది. ‘2025-26 మదింపు సంవత్సరానికిగాను నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అప్డేట్ చేయడానికి సమయం పట్టింది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్నులు ఫైల్ చేయడం కోసం ఈ గడువును పెంచినట్టు ఐటీ శాఖ తన ఎక్స్‌లో పేర్కొంది.
రూ.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్‌లు ఫామ్-1, 4తో ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సివుంటుంది. ప్రస్తుతం ఈక్విటీల నుంచి రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు పొందిన సంస్థలు అటువంటి ఆదాయాన్ని ఐటీఆర్ 1, 4 ఫామ్‌లో చూపించుకోవచ్చును. గతంలో వీరు ఐటీఆర్-2ను దాఖలు చేయాల్సివుండేది. దీంతోపాటు 80సీ, 80జీజీ, ఇతర సెక్షన్ల కింద డిడక్షన్ క్లెయింకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది.
సాధారణంగా, ఐటీఆర్ ఫామ్‌లను ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నోటిఫై చేస్తుండగా, ఈసారి మాత్రం నూతన ఆదాయ పన్ను చట్టం ప్రవేశపెట్టడంతో ఆలస్యమైందని, దీంతో ఐటీ ఫామ్‌లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని సీబీడీటీ వర్గాలు పేర్కొన్నాయి.