హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): గృహ రుణాలపై వడ్డీరేటు ఈ ఏడాది ఏప్రిల్ వరకు 6.5 శాతం ఉండేది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తుల కొనుగోలుకు గొప్పగా ఊతమిచ్చింది. బ్యాంకులో రుణాలను తీసుకొని ఇండ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లను, లేఅవుట్లో ఖాళీ స్థలాలను కొనుగోలు చేసేందుకు అంతా ఆసక్తి చూపించారు. అయితే మారిన పరిస్థితుల కారణంగా గత 5-6 నెలల నుంచి బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతూ వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచినకొద్దీ తదనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లనూ బ్యాంకులు పెంచుతూపోతున్నాయి. ఇటీవలి ద్రవ్యసమీక్ష సందర్భంగా కూడా ఇదే జరిగింది. ఫలితంగా వడ్డీరేట్లు 8.4 శాతానికి చేరుకున్నాయి. గత 6 నెలల్లో వడ్డీరేట్లు 1.9 శాతం ఎగబాకడం గమనార్హం. దీంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి స్థిరంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై పెరిగిన బ్యాంకు రుణాల వడ్డీరేట్లు తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి.
రుణగ్రహీతల్లో అయోమయం
నిజానికి తక్కువ వడ్డీరేటును చూసి ఎంతోమంది ఇండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ కరోనా మునుపటి స్థాయికే మళ్లీ వడ్డీరేట్లు చేరడంతో ఈ 2-3 ఏండ్లలో ఇండ్లు కొన్నవారు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. మున్ముందు మరింతగా వడ్డీరేట్లు పెరుగుతాయన్న సంకేతాలు స్పష్టంగా ఉండటంతో లెక్కలేసుకుంటున్నారు.
సామాన్యుడికి గృహభారం
పెరుగుతున్న వడ్డీరేట్లు, భూముల ధరలతో సామాన్యుడికి సొంతింటి కల భారమే అవుతోంది. నగర, శివారు ప్రాంతాలనే తేడా లేకుండా రేట్లు పరుగులు పెడుతున్నాయి మరి. నిజానికి దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే తక్కువ ఖర్చుతో జీవనం సాగించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని అధ్యయనాలే చెప్తున్నాయి. కానీ ఇటీవలి వడ్డీరేట్ల పెంపు మధ్యతరగతి వర్గాల సొంతింటి కలకు శరాఘాతంగా మారింది. ఈఎంఐలు గుదిబండగా తయారయ్యాయి. ఇక ప్రధాన నగరంలో ఇండ్ల ధరలు అందనంత ఎత్తులో ఉంటే.. శివారు ప్రాంతాల్లో మాత్రం కొంత నయంగా ఉన్నాయి. అయినప్పటికీ సరసమైన ధరలకు నివాసాలు లభించే అవకాశాలు లేవని పరిశ్రమ వర్గాలే చెప్తుండటం గమనార్హం.
నెమ్మదిస్తున్న నిర్మాణాలు
పెరుగుతున్న బ్యాంకు వడ్డీరేట్ల ప్రభావం ఎక్కువగా నిర్మాణ రంగంపైనే పడుతున్నది. వ్యక్తిగత ఇంటి నిర్మాణాలకు కావచ్చు, భారీ నివాస ప్రాజెక్టులకు కావచ్చు.. బ్యాంకు రుణాలే ఆధారం. పెరుగుతున్న వడ్డీరేట్ల నేపథ్యంలో ఇప్పుడివన్నీ ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి. కొనుగోలుదారులు ముందుకురాక బిల్డర్లు నిర్మాణ పనులను ఆపేసే పరిస్థితులు వచ్చాయి. దీంతో నిర్మాణ రంగ అనుబంధ రంగాలూ ప్రభావితమవుతున్నాయి. స్టీల్, సిమెంట్ ధరలూ పెరగడం కూడా రియల్టీకి ప్రతికూలంగా మారింది.
కొనేవారు తగ్గుతున్నారు
వడ్డీరేట్లు పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు తగ్గుతున్నాయి. గత కొన్ని నెలల కిత్రం వడ్డీరేటు చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువమంది ఆస్తులను కొనుగోలు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం లావాదేవీలు పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల నుంచి అధిక వడ్డీరేటుకు రుణాలు తీసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం లేదు.
– జీ విజయ భాస్కర్, ఎస్బీఐ మేనేజర్
ఆసక్తి చూపడం లేదు
అధిక వడ్డీరేట్లు ఉన్నప్పుడు సహజంగానే గృహ రుణాలు తీసుకునేవారు తక్కువగా ఆసక్తి చూపుతారు. అయినప్పటికీ మార్కెట్ పరిస్థితులనుబట్టే రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు ఉంటాయి. కేవలం వడ్డీరేట్ల పెరుగుదలతోనే ఒక్కసారిగా అమ్మకాలు తగ్గిపోయే అవకాశం లేదు. ఎవరైనాసరే తక్కువ వడ్డీరేటు ఉన్నప్పుడే రుణాలు తీసుకోవాలని చూస్తారు.
– ఈ రఘు, బ్యాంక్ అధికారి