Bank Holidays | డిజిటల్ పేమెంట్స్ పెరిగినా.. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లాల్సి రావొచ్చు. అయితే, ఆయా బ్యాంకుల శాఖలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా సెలవులు ఉన్నాయా.. లేవా.. అని చెక్ చేసుకుంటే మంచిది. అయితే, మార్చిలో కేవలం రెండే రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మహా శివరాత్రి సందర్భంగా మార్చి ఒకటో తేదీన సెలవు.. కొన్ని రాష్ట్రాల్లో మినహా.. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
ప్రతి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చివరి నెల మార్చి. జాతీయ సెలవు దినాలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో పర్వదినాలు, ఇతర వేడుకల వల్ల ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మార్చి మూడో తేదీన సిక్కింలో స్థానిక పండుగ వల్ల బ్యాంకులకు సెలవు. మిజోరంలో మార్చి నాలుగో తేదీన హాలీడే. రెండో, నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
మార్చి 17న కాముని దహనం (హోలికా దహన్) ఉంటుంది. ఈ తేదీనాడు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మార్చి 18న హోలీ పండుగ. దేశంలోనే ప్రధాన పర్వదినాల్లో ఇదొకటి. కానీ కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇంఫాల్, కోల్కతా, తిరువనంతపురం, కొచిల్లో బ్యాంకులు యధావిధిగా పని చేస్తాయి.
మార్చి 19న ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. వీటితోపాటు ఆదివారాలు, రెండో-నాలుగో శనివారం సందర్భంగా 6,12,13,20,26,27 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక మార్చి 22న బీహార్ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు 13 రోజులు సెలవులు వచ్చాయి. రాష్ట్రాల వారీగా పండుగలను బట్టి ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి.