న్యూఢిల్లీ, నవంబర్ 20: గత నెల దేశీయ మౌలిక రంగంలో వృద్ధిరేటు సున్నాకు పరిమితమైంది. గడిచిన 14 నెలల్లో 8 కీలక రంగాల పనితీరు ఇంత అధ్వానంగా ఉండటం ఇదే తొలిసారి. గురువారం విడుదలైన కేంద్ర గణాంకాల్లో అక్టోబర్లో కోర్ ఇండస్ట్రీస్ గ్రోత్ జీరో అని తేలింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్తు రంగాల్లో ఈ ఏడాది సెప్టెంబర్లో ఉత్పాదకత వృద్ధిరేటు 3.3 శాతంగా ఉన్నది. అంతకుముందు నెల ఆగస్టులోనైతే 6.5 శాతంగా నమోదైంది. కానీ అక్టోబర్లో మాత్రం సున్నాకు దిగజారింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు తర్వాత కీలక రంగాల్లో ఇదే అత్యంత పేలవమైన ప్రదర్శనగా నిలిచింది. నాడు మైనస్ 1.5 శాతంగా ఉన్నది.
మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయికి వృద్ధిరేటు క్షీణించింది. ఇక నిరుడు అక్టోబర్లో 3.8 శాతంగా వృద్ధి కనిపించింది. ఈసారి వార్షిక ప్రాతిపదికన బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం, విద్యుదుత్పత్తి 7.6 శాతం, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం, ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం చొప్పున పతనమైపోయింది. దీంతో పెట్రోలియం రిఫైనరీ ఉత్పాదకత 4.6 శాతం, ఎరువుల ఉత్పత్తి 7.4 శాతం, ఉక్కు తయారీ 6.7 శాతం, సిమెంట్ తయారీ 5.3 శాతం చొప్పున పెరిగినా సూచీ నిలబడలేకపోయింది.
ఈ ఏప్రిల్-అక్టోబర్ వృద్ధిరేటు కూడా 2.5 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిరుడు 4.3 శాతంగా ఉండటం గమనార్హం. ఏదిఏమైనా దేశీయంగా మొత్తం పారిశ్రామికోత్పత్తిలో ఈ 8 కీలక రంగాల వాటానే 40.27 శాతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశ జీడీపీకి ఇది గట్టి దెబ్బగానే ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారిప్పుడు.