ముంబై, జూలై 29: దేశంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 1.152 బిలియన్ డాలర్లు క్షీణించి 571.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్రమేణా పడిపోతుండటం.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడిని పెంచుతున్నది. కాగా, నిరుడు సెప్టెంబర్‌లో ఫారెక్స్ రిజర్వులు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 642 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు 71 బిలియన్ డాలర్లు పతనమవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే బంగారం నిల్వల విలువ 145 మిలియన్ డాలర్లు పెరిగి 38.502 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది.