న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఐటీ పరిశ్రమ చూపు చిన్న నగరాలవైపు మళ్లింది. ఇన్నాళ్లూ బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ తదితర సంప్రదాయ ఐటీ హబ్‌లలోనే స్థిరపడుతూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం.. రూటు మార్చింది. వరంగల్, విశాఖపట్నం, కోయంబత్తూర్, ఉదయ్‌పూర్, నాగ్‌పూర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యకలాపాలను ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులనూ పెద్ద ఎత్తున నియమించుకుంటూపోతున్నాయని ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ టీమ్‌లీజ్ చెప్తున్నది. జెనరేటివ్ ఏఐసహా ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల్లో మైసూరు నగరం ఆకర్షణీయంగా ఉందంటున్నది. ఈ నియామకాల్లో 32 శాతం ఇక్కడే జరిగాయన్నది.
ఈ ఏడాది జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న టైర్-2, 3 నగరాల్లో ఐటీ నియామకాలు పుంజుకున్నాయి. టీమ్‌లీజ్ తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ గతంతో పోల్చితే 50 శాతానికిపైగా వృద్ధి కనిపించడం గమనార్హం. సాఫ్ట్వేర్ దాని అనుబంధ రంగాల్లో విధులను నిర్వర్తించేందుకు భారీగా ఆయా కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయని తేలింది. ఇదే సమయంలో బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ వంటి మెట్రో సిటీల్లో 12-15 శాతం వృద్ధే నమోదైంది. సహాయక పనులకు సంబంధించిన రిక్రూట్మెంట్లలో కూడా చిన్న నగరాల్లో 24-31 శాతం పెరుగుదల ఉన్నది. పెద్ద నగరాల్లో ఇది 8-15 శాతమేనని టీమ్‌లీజ్ వెల్లడించింది.
ఫుల్-స్టాక్ డెవలపర్లు, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్లతోపాటు సైబర్‌సెక్యూరిటీ అనలిస్టులు, క్లౌడ్ స్పెషలిస్టులను ఎక్కువగా కొలువుల్లోకి తీసుకుంటున్నారు. కాగా, పెద్ద నగరాలతో పోల్చితే చిన్న నగరాల్లో నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం కూడా కలిసొస్తున్నదని ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్తున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు.. వరంగల్ తదితర నగరాలకు ఇప్పుడు కొత్త భవిష్యత్తునిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు నెలకొల్పాలని కంపెనీలను నాటి ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సైతం ఈ దిశగా బలమైన నిర్ణయాలనే తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా వరంగల్ నగరం ఎదుగుతూ వచ్చిందన్న అభిప్రాయాలు ఐటీ ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతున్నాయి.
2025లో భారతీయ ఐటీ సేవల రంగం.. ఉద్యోగ నియామకాల్లో విభిన్నంగా ఆలోచిస్తున్నది. మెట్రో నగరాల్లో కాకుండా, నాన్-మెట్రో నగరాల్లో విస్తరిస్తూపోతున్నది. దీంతో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ సంబురం కనిపిస్తున్నది. నిజానిక గత ఏడాది నుంచే ఈ మార్పు చోటుచేసుకున్నది.
-నీతి శర్మ, టీమ్‌లీజ్ సీఈవో