ముంబై, జూన్ 16: అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. జూన్ 9తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.318 బిలియన్ డాలర్లమేర క్షీణించి 593.749 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి. మే నెల చివరి రెండు వారాలూ క్షీణిస్తూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు జూన్ 2తో ముగిసిన వారంలో ఇవి 5.93 బిలియన్ డాలర్ల వరకూ పెరిగినప్పటికీ, తాజా సమీక్షావారంలో తిరిగి తగ్గినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రూపాయి పతనాన్ని నిలువరించడానికి ఆర్బీఐ డాలర్లను ఖర్చుచేయడంతో ఈ తరుగుదల ఏర్పడింది. గతవారం డాలరు మారకంలో రూపాయి విలువ 82.8 స్థాయి వరకూ పతనమయ్యింది.
కేంద్ర బ్యాంక్ డాలర్లను విక్రయించిన కారణంగా విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.128 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 525.073 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. బంగారం నిల్వలు 183 బిలియన్ డాలర్లు తగ్గి 45.374 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 2 మిలియన్ డాలర్ల మేర పెరిగి 18.187 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయి. ఐఎంఎఫ్ వద్దనున్న నిల్వలు 8 బిలియన్ డాలర్ల వరకూ పెరిగి 5.115 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్‌లో నమోదైన 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయిని మళ్లీ విదేశీ మారక నిల్వలు అందుకోలేకపోతున్నాయి. అప్పటి నుంచి నిలువునా పడిపోయిన రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విక్రయిస్తూ వచ్చింది. దీంతో ఒకదశలో రిజర్వులు 500 బిలియన్ డాలర్లస్థాయికి సైతం పడిపోయాయి.