శనివారం 30 మే 2020
Business - Feb 15, 2020 , 03:06:10

మా తీర్పునే నిలిపేస్తారా?

మా తీర్పునే నిలిపేస్తారా?

ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సిందిగా టెల్కోలను ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన తీర్పుపై డీవోటీ డెస్క్‌ అధికారి స్టే విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బకాయిల విషయంలో టెల్కోలు తమ తీర్పును బేఖాతరు చేయడాన్ని, నిర్దేశిత గడువు (జనవరి 23)లోగా డీవోటీకి బకాయిలు చెల్లించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీన్ని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో తెలుపాలంటూ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌), భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌ తదితర సంస్థలకు సుప్రీంకోర్టు శుక్రవారం సమన్లు జారీచేసింది. ‘అసలు ఈ దేశంలో న్యాయం ఉన్నదా?’ అని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా ప్రశ్నించడంతో డీవోటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బకాయిలు చెల్లించని టెల్కోలపై బలవంతపు చర్యలు చేపట్టవద్దంటూ గతనెలలో జారీచేసిన ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకొంటున్నట్టు డీవోటీ ప్రకటించడంతోపాటు ఏజీఆర్‌ బకాయిలన్నీ శుక్రవారం అర్ధరాత్రి 11ః59 నిమిషాల్లోగా చెల్లించాలని ఆదేశిస్తూ టెల్కోలకు డిమాండ్‌ నోటీసులు పంపింది. ఈ ఆదేశం మేరకు ఈ నెల 20లోగా రూ.10 వేల కోట్లు చెల్లిస్తామని, మిగిలిన బకాయిలను వచ్చేనెల 17లోగా తీర్చేస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. డీవోటీ నోటీసులపై ఇతర టెలికం సంస్థలు ఇంకా స్పందించలేదు.

  • మీపై ఎందుకు చర్యలు చేపట్టకూడదు?
  • ఏజీఆర్‌ బకాయిలు ఎందుకు చెల్లించలేదు?
  • మా తీర్పు అమలుపైనే స్టే విధిస్తారా?
  • డెస్క్‌ ఆఫీసర్‌కు అంత కావరమా?
  • తీర్పులకు విలువలేకపోతే కోర్టులెందుకు?
  • డీవోటీ, టెల్కోలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జనవరి 23లోగా టెలికం విభాగానికి (డీవోటీకి) రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ (సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ) బకాయిలు చెల్లించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును టెల్కోలు పాటించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. అసలు ఈ దేశంలో న్యాయం ఉన్నదా? అని ప్రశ్నించింది. తమ తీర్పును పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి ఎందుకు చర్యలు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని టెల్కోలను ఆదేశించింది. ఏజీఆర్‌ బకాయిల వ్యవహారంలో తామిచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ టెలికం విభాగ డెస్క్‌ ఆఫీసర్‌ ఉత్తర్వు జారీచేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. 


ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలంటూ టెల్కోలపై ఒత్తిడి తీసుకురాకూడదని, వాటిపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకూడదని డివోటీ డెస్క్‌ ఆఫీసర్‌ ఒకరు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు, ఇతర రాజ్యాంగ సంస్థలకు లేఖ రాశారని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏజీఆర్‌ బకాయిలను చెల్లించేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలుచేసిన పిటిషన్లపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతూ.. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై ఓ డెస్క్‌ అధికారి ఏవిధంగా స్టే విధిస్తారని ప్రశ్నించింది. 


సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఓ డెస్క్‌ అధికారి ఏవిధంగా స్టే విధిస్తారు? అసలు దేశంలో న్యాయం ఉన్నదా? మీరు కోర్టులను పరిగణించే తీరు ఇదేనా? అని ధర్మాసనం నిలదీసింది. ‘ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నదెవరో మాకు తెలియదు. దేశంలో న్యాయం ఉన్నదా? అని ప్రశ్నించుకొంటే బాధ కలుగుతున్నది. ఈ కోర్టులో, ఈ వ్యవస్థలో పనిచేయకూడదన్న భావన కలుగుతున్నది. ఇవి కోపంతో అంటున్న మాటలు కాదు. బాధ్యతతో చెప్తున్న మాటలు. ఇలాంటి వ్యవస్థలో, దేశంలో ఎలా పనిచేయాలో నాకు అర్థంకావడంలేదు’ అని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా క్షమాపణ చెప్తూ.. డెస్క్‌ అధికారి ఆ పని చేయకూడదన్నారు. దీంతో ధర్మాసనం మరోసారి ఘాటుగా స్పందించింది. 


‘ఈ దేశానికి సొలిసిటర్‌ జనరల్‌గా మీరు ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనకు (డెస్క్‌ అధికారికి) సూచించారా? ఇలాంటి పనులను సహించకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పనిచేయలేం. మీ డెస్క్‌ అధికారికి అంత అధికారం ఉంటే న్యాయస్థానాలు ఎందుకు? సుప్రీంకోర్టును మూసేద్దాం. మీ డెస్క్‌ అధికారి సుప్రీంకోర్టు ఉత్తర్వునే నిలిపివేశాడు. ఆయన సుప్రీంకోర్టు నెత్తిపై కూర్చుంటాడా? ఎలా కూర్చుంటాడు? ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నదెవరు? ఈ దేశంలో జీవించడం కంటే దేశాన్ని వదిలివెళ్లడం మంచిదనిపిస్తున్నది. ఈ వ్యక్తి (డెస్క్‌ అధికారి)తోపాటు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించని టెలికం కంపెనీలపై మేము కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలి. ఆ కంపెనీలు ఎలా ప్రవర్తిస్తున్నాయో తెలుస్తున్నదా? ఏజీఆర్‌ బకాయిల్లో ఇప్పటివరకు నయాపైసా చెల్లించలేదు. 


ఆ కంపెనీల రివ్యూ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నాం. మీ డెస్క్‌ అధికారి మా ఉత్తర్వు అమలును నిలిపివేశాడు. ఈ దేశ దుస్థితిని, న్యాయవ్యవస్థ పరిస్థితిని చూస్తుంటే ఆందోళన కలుగుతున్నది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించించింది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిగే మార్చి 17న సంబంధిత టెలికం కంపెనీల ఎండీలు, డైరెక్టర్లు తమ ఎదుట హాజరై ఏజీఆర్‌ బకాయిలను ఎందుకు చెల్లించలేదో, వారిపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పుపై స్టే విధించినందుకు డీవోటీ డెస్క్‌ ఆఫీసర్‌పై తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదన్న దానిపై ఆయన కూడా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.


20లోగా రూ.10 వేలకోట్లు చెల్లిస్తాం: ఎయిర్‌టెల్‌

ఓవైపు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, మరోవైపు డీవోటీ తాజాగా ఉత్తర్వులు జారీచేయడంతో ఏజీఆర్‌ ఉత్తర్వులపై భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 20లోగా రూ.10 వేల కోట్లు చెల్లిస్తామని, ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ జరిపేలోగా మిగిలిన బకాయిలన్నీ చెల్లిస్తామని శుక్రవారం టెలికం విభాగానికి రాసిన లేఖలో ఎయిర్‌టెల్‌ తెలిపింది.


టెల్కోలకు డీవోటీ షాక్‌

ఏజీఆర్‌ బకాయిలన్నీతక్షణమే చెల్లించాలని ఆదేశం

శుక్రవారం అర్ధరాత్రి వరకు గడువు

సుప్రీంకోర్టు చివాట్ల నేపథ్యంలో టెలికం కంపెనీలకు డీవోటీ షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించిన బకాయిలన్నీ శుక్రవారం అర్ధరాత్రిలోగా చెల్లించాలని ఆదేశిస్తూ భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ తదితర సర్వీస్‌ ప్రొవైడర్లకు సర్కిళ్లవారీగా నోటీసులు జారీచేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఏజీఆర్‌ బకాయిలు చెల్లించని టెల్కోలపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతనెలలో తాము జారీచేసిన ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకొంటున్నట్టు డీవోటీ ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిల వసూలుపై గతేడాది అక్టోబర్‌లో ఇచ్చిన తీర్పును పాటించేందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని తమ ఫీల్డ్‌ ఆఫీసర్లను ఆదేశిస్తున్నట్టు డీవోటీ తెలిపింది. 


టెలికం కంపెనీల నుంచి ఏజీఆర్‌ బకాయిల వసూలును నిలిపివేసినందుకు సుప్రీంకోర్టు నుంచి ఆగ్రహం ఎదురవడంతో డీవోటీ ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ‘లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్‌ వినిమయ చార్జీలకు సంబంధించిన పాత బకాయిలన్నీ శుక్రవారం (14-02-2020) రాత్రి 11ః59 గంటల్లోగా చెల్లించాలని ఆదేశిస్తున్నాం’ అని టెల్కోలకు జారీచేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపున కోసం డీవోటీ నుంచి తమకు డిమాండ్‌ నోటీసు అందినట్టు ఓ టెలికం కంపెనీ ధ్రువీకరించింది. దేశంలో 15 టెలికం కంపెనీలు లైసెన్సు ఫీజు రూపంలో రూ.92,642 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినిమయ చార్జీల రూపంలో మరో రూ.55,054 కోట్ల చొప్పున కేంఅద ప్రభుత్వానికి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల పాత బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. వీటిలో వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ బకాయిలే రూ.53 వేల కోట్లు ఉండగా.. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.35,586 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఇందులో శుక్రవారం అర్ధరాత్రిలోగా ఎంతమొత్తాన్ని చెల్లించాలని డీవోటీ ఆదేశించిందో ఇంకా తెలియరాలేదు.


కుదేలైన వొడాఫోన్‌ ఐడియా షేరు

వొడాఫోన్‌ ఐడియా షేరు కుదేలైంది. శుక్రవా రం స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కం పెనీ షేరు 23.21 శాతం పతనం చెంది రూ. 3.44కి జారుకున్నది. దీంతో కంపెనీ మార్కె ట్‌ విలువ రూ.2,988.03 కోట్లు కరిగిపోయి రూ.9,884.97 కోట్లకు జారుకున్నది.


logo