న్యూఢిల్లీ : దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతున్న క్రమంలో ముఖ్యంగా మిలియన్ డాలర్ల (రూ. 8 కోట్లు) వార్షిక వేతన ప్యాకేజ్ అందుకుంటున్న వారిని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తొలగిస్తున్నాయి. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తొలగించిన ఉద్యోగుల్లో గతంలో అత్యధిక సామర్ధ్యం కనబరిచిన వారు, మేనేజర్ పోస్టుల్లో ఉన్నవారు అధికంగా ఉండటం గమనార్హం.
వీరిలో పలువురి వార్షిక వేతన ప్యాకేజ్ 5 లక్షల డాలర్ల నుంచి మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని ఓ రిపోర్ట్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో 12,000 మంది ఉద్యోగులను సాగనంపుతామని గూగుల్ మాతృ సంస్ధ అల్ఫాబెట్ ఇటీవల ప్రకటించింది. గూగుల్ క్లౌడ్, క్రోమ్, అండ్రాయిడ్ సహా పలు విభాగాలు, సెగ్మెంట్లలో ఉద్యోగుల కోత ఉంటుందని కంపెనీ తెలిపింది. స్ట్రేటజీ, రిక్రూటింగ్, మార్కెటింగ్ టీమ్స్‌లోనూ గూగుల్ క్లౌడ్‌లో లేఆఫ్స్ ఉన్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.
ఇదేతరహాలో మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించగా హలో వంటి గేమ్ డెవలప్మెంట్ స్టూడియోలో భారీగా ఉద్యోగులను తొలగించారు. మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్) హెడ్సెట్ టీమ్స్‌లోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. 2017లో మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసిన అల్ట్స్పేస్ వీఆర్ వర్చువల్ రియాలిటీ ఆధారిత సోషల్ ప్లాట్‌ఫాంను కంపెనీ మూసివేసింది. అమెజాన్‌లోనూ అధిక వేతనాలు అందుకునే టెకీలపై కంపెనీ వేటు వేసినట్టు సమాచారం.