Tata Sons- Rishi Sunak | టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశమయ్యారు. బ్రిటన్‌లో గ్లోబల్ బ్యాటరీ సెల్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రిషి సునాక్‌ను చంద్రశేఖరన్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బ్రిటన్‌లోని వార్‌విస్క్ షైర్లో గల జాగ్వార్ లాండ్ రోవర్ గాయ్డన్ సెంటర్లో వీరు కలుసుకున్నారు. టాటా కంపెనీ 400 కోట్ల పౌండ్లపై చిలుకు (రూ.42 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. యూరప్ లోనే ఇది అతిపెద్ద ఫ్యాక్టరీ కానున్నది. గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని టాటా సన్స్ ప్రకటించడం బ్రిటన్‌లోని ఆటోమోటివ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ దేశాలన్నీ సంప్రదాయ పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా అడుగులేస్తున్న వేళ.. బ్రిటన్‌లో బ్యాటరీల తయారీకి గ్లోబల్ బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ ముందుకు వచ్చింది. మొబిలిటీ, ఇంధన రంగ అవసరాల కోసం అత్యంత నాణ్యత, హై పెర్పార్మెన్స్ సుస్థిర బ్యాటరీ సెల్స్, ప్యాక్స్ లను బ్యాటరీ సెల్ గిగా ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. దేశీయంగా ఒక ఏడాది ఈ ఫ్యాక్టరీ ఏడాది పాటు 40 గిగావాట్ల సామర్థ్యం గల సెల్స్ తయారు చేయాల్సి ఉంటుంది.
టాటా సన్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న న్యూ గిగా ఫ్యాక్టరీ వల్ల బ్రిటన్‌లో నాలుగు వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. 2026లో ఈ న్యూ గిగా ఫ్యాక్టరీ .. బ్యాటరీ సెల్స్ తయారీ ప్రారంభిస్తుంది. బ్రిటన్‌లో బ్యాటరీల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్ కార్లకు వాటిని సరఫరా చేస్తారు. బ్రిటన్‌లో జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ లగ్జరీ కార్లు, ఎస్యూవీ కార్లను టాటా మోటార్స్ తయారు చేస్తున్నది. బ్రిటన్‌లో జాగ్వార్ లాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కార్ల యూనిట్ త్వరలో ప్రారంభిస్తామని టాటా సన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
2030 నాటికి బ్రిటన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అవసరాలకు 100 గిగావాట్ల కెపాసిటీ గల బ్యాటరీ సెల్స్ అవసరం అని ఫరాడే ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది. 2040 నాటికి 200 గిగావాట్ల కెపాసిటీ గల బ్యాటరీ సెల్స్ అవసరం కావచ్చు.