న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,783 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. తన అనుబంధ సంస్థయైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ రాణించడం వల్లనే లాభాల్లోకి రాగలిగామని కంపెనీ వర్గా లు వెల్లడించాయి. వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ సంస్థ లాభాలను ప్రకటించడం విశేషం. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,004 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.79,611 కోట్ల నుంచి రూ.1,05, 124 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏకీకృత విషయానికి వస్తే రూ.1,270 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత త్రైమాసికంలో జేఎల్ఆర్ ఆదాయం 6.9 బిలియన్ పౌండ్లు సమకూరింది. గత త్రైమాసికంలో సంస్థ దేశీయంగా 99, 300 యూనిట్ల కమర్షియల్ వాహనాలను, 1.39 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.