Tata Tigor EV |ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో దూసుకెళ్తున్న టాటా మోటార్స్.. తాజాగా మార్కెట్లోకి టైగోర్ ఈవీ అప్డేట్ వర్షన్ విడుదల చేసింది. ఒక్కసారి చార్జి చేస్తే 315 కి.మీ. దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ. రూ.12.49 లక్షల నుంచి ఈ కారు ధర ప్రారంభం అవుతుంది. టైగోర్ ఈవీ వేరియంట్స్‌లో మార్పులు తీసుకొచ్చింది. తాజాగా ఎక్స్‌జడ్ ప్లస్ లక్స్ టాప్ వేరియంట్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఒక్కసారి చార్జి చేస్తే న్యూ టాటా టైగోర్ ఈవీ 315 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇంతకుముందు విడుదల చేసిన మోడల్ కార్లు 306 కి.మీ. దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. 59 నిమిషాల్లో న్యూ టాటా టైగోర్ 10-80 శాతం చార్జి అవుతుంది. ఇంటి వద్ద చార్జింగ్ కావడానికి 8.5 గంటలు పడుతుంది. 15ఏ సాకెట్తోనూ చార్జింగ్ చేసుకోవచ్చు. దీంతో ఇంటి వద్ద, ఆఫీసు వద్ద తేలిగ్గా చార్జింగ్ అవుతుంది.
తాజా టాటా టైగోర్ ఈవీ కేవలం 5.7 సెకన్లలో 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 55 కిలోవాట్ల విద్యుత్ మోటార్, 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 55 కిలోవాట్ల విద్యుత్ మోటార్‌తో 74 బీహెచ్పీ విద్యుత్, 170 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
లెథరెట్టే అప్హోస్టరీ, క్రూయీజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైఫర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కారుపై ఎనిమిదేండ్లతోపాటు 1.60 లక్షల కి.మీ. వరకు బ్యాటరీకి వ్యారంటీ ఉంటుంది. హిల్ అస్కెంట్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐపీ67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్‌తో టైగోర్ఈవీ అప్డేటెడ్ కారు వస్తున్నది.