Tata Motors Cars Costly | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెంచనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అన్ని కార్లు, వేరియంట్లపై సగటున 0.6 శాతం ధరలు పెంచుతున్నామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. గత ఫిబ్రవరి నుంచి టాటా మోటార్స్ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఈ నెల 30 వరకు అంటే వచ్చే 15 రోజులు మాత్రం టాటా మోటార్స్ కార్ల ధరలు స్వల్పంగా తక్కువ.
కార్ల తయారీ ఖర్చు పెరగడం వల్లే వాటి ధరలు పెంచాలని నిర్ణయించామని టాటా మోటార్స్ తెలిపింది. న్యూ రెగ్యులేటరీ నిబంధనల్లో మార్పుల వల్ల కార్ల ధరలు పెంచక తప్పడం లేదని వెల్లడించింది. ఇంతకుముందు కమర్షియల్ వెహికల్స్ ధరలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదు శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఐఈసీ కార్ల తయారీ ధరలు సగటున 1.2 శాతం పెంచుతున్నట్లు గత ఫిబ్రవరిలో వివరించింది. ఫిబ్రవరి పదో తేదీ నుంచి టాటా టియాగో ఈవీ కారు ధర సుమారు రూ.20 వేలు పెరిగింది.
కర్బన ఉద్గారాలను మరింత తగ్గించేందుకు కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అందువల్లే కార్ల ధరలు పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్రకటించింది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాల్లో భాగంగా కార్ల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వాటిల్లో కార్ల తయారీ సంస్థలు.. `రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ)` పరికరం అమర్చాల్సి ఉంటుంది. ఆర్డీఈ పరికరం కాసింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువల్లే కార్ల తయారీ సంస్థలన్నీ తమ అన్ని రకాల కార్ల ధరలు పెంచేస్తున్నాయి.
టాటా మోటార్స్ పలు రకాల కార్లను తయారు చేసి విక్రయిస్తున్నది. వాటిల్లో టాటా టియాగో, టాటా టైగోర్, టాటా ఆల్ట్రోజ్ ఉన్నాయి. ఎస్యూవీ సెగ్మెంట్లో పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్లు కూడా టాటా మోటార్స్ విక్రయిస్తున్నది. ఈ కార్ల ధరలు రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పలుకుతున్నాయి.