హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది 100 జీసీసీ(గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి ద్వారా లక్ష మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘బాడిస్చ్ అనిలిన్ ఉండ్ సోడా ఫ్యాబ్రిక్ (బీఏఎస్ఎఫ్)’ హైదరాబాద్‌లో రెండు జీసీసీల ఏర్పాటు చేసేందుకు ముందుకురాగా.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ కేవలం కార్యాలయాల కేంద్రంగా మాత్రమే కాకుండా.. ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు ఆధారిత కేంద్రం ఐకామ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐసిటీ, క్వాంటమ్ హబ్, జీవ విజ్ఞాన పరిశోధనా సంస్థ ‘1బయోల్యాబ్’లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. బీఏఎస్‌ఎఫ్‌తో కొత్తగా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
‘ఐటీపీ ఏరో-ఇండియా’ ప్లాంట్ భూమి పూజ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్ వేర్ పార్క్ (ఫేజ్-3)లో రూ.453 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ‘ఐటీపీ ఏరో-ఇండియా’ ప్లాంట్‌కు మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. ఈ ప్లాంట్ 2027 నాటికి ప్రారంభం కానున్నట్టు మంత్రి తెలిపారు. ప్రిసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్తగా 350 మందికి ఉపాధి లభించనుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 600కి పెరుగనున్నది.
పరిశ్రమలకు ఇంజినీర్ల శిక్షణ బాధ్యతలు
రాష్ట్రంలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రుల శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సంసిద్ధం చేసే బాధ్యతను పరిశ్రమలు తీసుకోవాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పీఎస్ఆర్ టెక్ హబ్ సంస్థ పదేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగంలో నిత్యం ఎదురయ్యే పెను సవాళ్లను అధిగమించి పదేండ్లలో రూ.120 కోట్ల సంస్థగా నిలదొక్కుకునేలా చేయడం పట్ల సంస్థ అధినేత శ్రీరంగారావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ఆవిష్కరణలు, ఏఐ లాంటి సవాళ్లను ఎదుర్కొని 250 మంది ఉద్యోగులకు భరోసానివ్వడం గొప్ప విషయమన్నారు.