Swiggy IPO | దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కొంత సానుకూల ధోరణి నెలకొనడంతో స్టార్టప్‌లు మొదలు ఫిన్ టెక్ కంపెనీలు, ఆటోమొబైల్ తదితర కంపెనీలు ఐపీఓ ద్వారా లిస్టింగ్ అవుతున్నాయి. ఇటీవల దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా కూడా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తాజాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
ఎల్ఐసీ, హ్యుండాయ్ తర్వాత స్విగ్గీదే అతిపెద్ద ఐపీఓ కానున్నది. నవంబర్ ఆరో తేదీన మొదలై ఎనిమిదో తేదీన స్విగ్గీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగుస్తుందని సమాచారం. దీనికి సంబంధించి స్విగ్గీ ఖచ్చితమైన తేదీలు ఈ వారంలోనే వెల్లడించనున్నది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.6,800 కోట్లు, తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.4,500 కోట్ల నిధులు సేకరించడం స్విగ్గీ లక్ష్యంగా కనిపిస్తున్నది. మొత్తం 11.2 బిలియన్ డాలర్ల నిధులు సేకరించడమే లక్ష్యంగా స్విగ్గీ ఐపీఓ ఉండనున్నది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నేపథ్యంలో స్విగ్గీ తన ఐపీఓ ఇన్షియల్ టార్గెట్ 15 బిలియన్ డాలర్ల లక్ష్యంలో 25 శాతానికి కుదించుకున్నట్లు ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
2022లో యూఎస్ అసెట్ మేనేజర్ ఇన్వెస్కో 700 మిలియన్ల డాలర్ల నిధుల సేకరణతో స్విగ్గీ కంపెనీ మార్కెట్ విలువ (ప్రైవేట్) 10.7 బిలియన్ డాలర్లు. మార్క్యూ ఫండ్స్ బ్లాక్ రాక్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీఐబీ) వంటి సంస్థలు ఐపీవో ద్వారా స్విగ్గీలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో మరో సంస్థ జొమాటోతో స్విగ్గీ పోటీ పడుతున్నది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీతోపాటు కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లో గ్రాసరీ వస్తువుల సరఫరాకు ‘క్విక్ కామర్స్’ రంగంలో అడుగు పెట్టాయి.