న్యూఢిల్లీ : భారత్‌లో సుజుకి ఇండియా లగ్జరీ బైక్ కటానాను లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 13.61 లక్షల ఎక్స్ షూరూం ధరకు అందుబాటులో ఉంటుంది. భారత్‌లో తమ బిగ్ బైక్ పోర్ట్‌పోలియోను ప్రవేశపెట్టే వ్యూహంలో భాగంగా కటానాను లాంఛ్ చేస్తున్నామని, గత ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించిన అనంతరం కటానా గురించి మోటార్‌సైకిల్ ఔత్సాహికుల నుంచి పలు ఎంక్వయిరీలు వచ్చాయని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సతోషి ఉచిద తెలిపారు.
పొటెన్షియల్ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో భారత్‌లో కటానాను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని చెప్పారు. భారత్‌లోనూ కటానాకు మెరుగైన ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుజుకి కటానా 999సీసీ ఫోర్ స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీఓహెచ్సీ వంటి ఫీచర్లను కలిగిఉంది. ఈ లగ్జరీ, స్పోర్టీ బైక్ సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం (ఎస్టీసీఎస్)ను కలిగిఉంది. ఇది అయిదు మోడ్ సెట్టింగ్స్‌ను ఎంపిక చేసుకునేలా ఆఫర్ చేస్తుంది.
పలు రైడింగ్ కండిషన్స్, స్టైల్స్‌కు వెసులుబాటు కల్పిస్తుంది. మూడు భిన్నమైన మోడ్స్‌లోకి మారేందుకు సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ (ఎస్డీఎంఎస్)ను పొందుపరిచారు. ఇక కటానా డిజైన్ ఫీచర్ల విషయానికి వస్తే యూనిక్ రెక్టాంగ్యులర్ షేప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ ఫ్రంట్ పొజిషన్ లైట్స్ కటానాకు స్టైలిష్ లుక్ తీసుకువచ్చాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్, బ్రేక్ లైట్ స్టన్నింగ్ డిజైన్‌ను తీసుకువచ్చాయి. సామర్ధ్యం, సదుపాయాలతో రాజీ పడకుండానే ఈ ఫీచర్లను జోడించడంతో కటానా ఇతర బైక్‌ల కంటే భిన్నంగా కస్టమర్లను ఆకట్టుకోనుంది.