SUV Cars | గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో గణనీయ మార్పు కనిపిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి.. అందునా స్పేసియస్గా ఉండే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)కు, హై ఎండ్ వెహికల్స్కు గిరాకీ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆటోమొబైల్ వాహనాలు ప్రత్యేకించి కార్ల విక్రయాల విలువ 19 శాతం వృద్ధి చెందింది. దాని విలువ రూ.10.22 లక్షల కోట్లు. అయితే, కార్ల విక్రయాలు మాత్రం 10 శాతం మాత్రమే పెరిగాయని ప్రిమస్ పార్టనర్స్ రిపోర్ట్ తెలిపింది. ఎస్యూవీల సెగ్మెంట్లో గ్రోత్ గణనీయంగా పెరుగుతోంది. వాల్యూమ్ రీత్యా 23 శాతం, ధరల రీత్యా 16 శాతం, మొత్తం మార్కెట్ విలువ 39 శాతం వృద్ధి నమోదైంది.
కార్ల తయారీలో ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో కార్లు, ప్రత్యేకించి ఎస్యూవీ కార్ల ధరలపై ప్రభావం పడింది. మరోవైపు కస్టమర్లు ఎస్యూవీ కార్ల వైపు మొగ్గు చూపడం మరో కారణం. హైబ్రీడ్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ గల కార్లకు పాపులారిటీ పెరుగుతున్నది. సన్ రూఫ్ వంటి ఫీచర్లు గల కార్లపైన అందరూ మోజు పెంచుకుంటున్నారు.
ద్విచక్ర వాహనాల సేల్స్ భిన్నంగా ఉన్నాయి. విక్రయాల పరంగా 10 శాతం, విలువ పరంగా 13 శాతం వృద్ధి పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో వాహనాల ధరలు తక్కువే. వాహనాల విక్రయాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ నిలుస్తుంది. గతేడాది రెండు కోట్లకు పైగా యూనిట్ల టూ వీలర్స్ అమ్ముడుపోయాయి. సప్లయ్ చైన్ సమస్యలు తగ్గడంతో కరోనా మహమ్మారి తర్వాత వాహనాలకు గిరాకీ రోజురోజుకు పెరుగుతున్నది. ఫీచర్లు, టాప్ ఎండ్ వాహనాల దిశగా భారతీయ కస్టమర్ల ప్రాధాన్యం పెరుగుతున్నది.