న్యూఢిల్లీ, ఆగస్టు 28 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాల విధింపు అమలులోకి రావడంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండోరోజు గురువారం ఇంట్రాడేలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 705.97 పాయింట్లు కోల్పోయి 80,080.57 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 211.15 పాయింట్లు కోల్పోయి 24,500.90 వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,555 పాయింట్లు నష్టపోవడంతో మదుపరులు పది లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.9,69,740.79 కోట్లు కరిగిపోయి రూ.4,45,17,222.66 కోట్లు(5.08 ట్రిలియన్ డాలర్లు)కు తగ్గింది.