Stock Market | ముంబై, ఆగస్టు 30: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు శుక్రవారం మరో మైలురాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 231.16 పాయింట్లు లాభపడి చారిత్రక గరిష్ఠ స్థాయి 82,365.77 వద్ద ముగిసింది. వారాంతం ట్రేడింగ్లో 2,228 సూచీలు లాభపడగా, 1,701 సూచీలు నష్టపోయాయి.
మరో సూచీ నిఫ్టీ సైతం ఉన్నత శిఖరానికి చేరుకున్నది. వరుసగా 12 రోజులుగా పెరుగుతూ వచ్చిన నిఫ్టీ శుక్రవారం సైతం 83.95 పాయింట్లు ఎగబాకి 25,235.90 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీతో మదుపరుల సంపద రూ.10 లక్షల కోట్లు పెరిగింది. గత తొమ్మిది సెషన్లలో సెన్సెక్స్ 1,941 పాయింట్లు లాభపడటంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ. 10,00,028 కోట్లు పెరిగి రూ. 4,64,39,993.77 కోట్లు(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. వచ్చే నెలలోనే ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించనుండటంతో గ్లోబల్ మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిశాయి..దీంతో దేశీయ సూచీలు కూడా పరుగులు పెట్టాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.