Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. అన్ని సెక్టార్ల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు లభించడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 231.16 పాయింట్ల లబ్ధితో 82,365.77 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 82,637.03 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. బీఎస్ఈ బాటలోనే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్ లో 25,268.35 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి దూసుకెళ్లి, మార్కెట్ల ట్రేడింగ్ ముగిసే సమయానికి 83.95 పాయింట్ల లాభంతో 25,235.90 పాయింట్ల వద్ద స్థిర పడింది.
నిఫ్టీ-50లో 41 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. సిప్లా, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ తదితర షేర్లు 2.23 శాతం లాభ పడ్డాయి. మరోవైపు బీఎస్ఈ-30 ఇండెక్సులో 21 స్టాక్స్ వృద్ధి చెందాయి. వాటిలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ లాభ పడ్డాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండో సెషన్ లోనూ నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.68 శాతం, స్మాల్ క్యాప్ 0.48 శాతం నష్టపోయాయి.
బుల్ పరుగులతో నిఫ్టీ ఐటీ 0.46 శాతం, ఫార్మా ఇండెక్సు 1.48 శాతం లబ్ధితో రికార్డు గరిష్టానికి చేరాయి. బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ ఆటో ఇండెక్స్ రెండో రోజు వరుసగా లాభ పడ్డాయి. నిఫ్టీ రియాల్టీ రెండు సెషన్ల నష్టాలను బ్రేక్ చేసింది. ప్రిస్టీజ్, ఫోనిక్స్ మిల్స్, ఓబెరాయి రియాల్టీ 1.83 శాతం లబ్ధితో దూసుకెళ్లాయి. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ 83.8725 వద్ద ముగిసింది.
మరోవైపు, శుక్రవారం పేటీఎం షేర్ ఇంట్రాడేలో ఆరు నెలల గరిష్ట స్థాయి రూ.631లకు చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే నాటికి ఎన్ఎస్ఈలో పేటీఎం షేర్ 12.70 శాతం లాభంతో రూ.624.90 వద్ద స్థిర పడింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది తొమ్మిదో తేదీన పేటీఎం షేర్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.310లకు పతనమైంది. పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో శుక్రవారం పేటీఎం షేర్ పుంజుకున్నది.