Starlink | భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేల కోసం ఎలాన్ మస్క్ స్టార్లింగ్ సహా ఇతర కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసే అంశంపై కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని భద్రతా పారామితులను కలిగి ఉన్నట్లయితే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన లైసెన్సులు స్టార్‌లింక్‌తో సహా ఎవరికైనా ఇవ్వవచ్చన్నారు. తాము భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకునేలా చూడాలని.. తమకు నిర్దిష్ట ఫార్మాట్ ఉందని.. దాన్ని పాటించాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కంపెనీలు షరతులను పాటిస్తే లైసెన్సులు జారీ చేస్తామని.. మార్గదర్శకాలను అనుసరిస్తేనే తాము సంతోషిస్తామన్నారు.
ఎలోన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు లైసెన్స్ పొందేందుకు అన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అన్ని అవసరాలను తీర్చే ప్రక్రియలో ఉందని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీలకు లైసెన్స్ లభిస్తుందన్నారు. ‘లైసెన్స్ పొందడానికి వారు (స్టార్‌లింక్) అన్ని నిబంధనలను పాటించాలని.. భద్రతా కోణంలోనూ చూడాల్సి ఉందని ఓ ప్రశ్నకు జ్యోతిరాధిత్య సింధియా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం, భారతి గ్రూప్ ఆధారిత వన్ వెబ్, జియో ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు ప్రభుత్వం లైసెన్స్‌లను జారీ చేసిన విషయం తెలిసిందే.