హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది బీ శ్రవంత్ శంకర్ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘బిజినెస్ వరల్డ్ లీగల్- అండర్ 40’ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రతి ఏడాది 40 ఏండ్లలోపు 40 మంది ప్రముఖ లాయర్ల నుంచి నామినేషన్లు స్వీకరించి ఇంటర్వ్యూల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో పనిచేసే సీనియర్ అడ్వకేట్లు ఈ ఎంపిక ప్రక్రియ చేపడతారు.
కమర్షియల్, లిటిగేషన్, ఆర్బిట్రేషన్, వైట్ కాలర్ క్రైమ్నకు సంబంధించిన కేసులను వాదించడంతో తక్కువ వయసులోనే శ్రవంత్ శంకర్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్యానెల్ లాయర్‌గా సుప్రీం కోర్టులో ఉన్నారు. రష్యన్ ఫెడరేషన్‌కు భారత్‌లో ప్యానెల్ లాయర్‌గా కొనసాగుతున్న ఆయన.. సుప్రీం కోర్టు లీగల్ ఎయిడ్ సర్వీస్ కమిటీ ప్యానెల్‌లోనూ ఉన్నారు.