ముంబై, ఆగస్టు 23: వివిధ కారణాలతో నిలిచిపోయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నడుం బిగించింది. ఇందులో భాగంగానే సోమవారం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్’ కింద చివరిసారిగా ప్రీమియం చెల్లించి ఐదేండ్లు, అంతకంటే తక్కువ కాలం అవుతున్న పాలసీలను తిరిగి ప్రారంభించుకునే అవకాశాన్ని పాలసీదారులకు ఎల్ఐసీ కల్పించింది. షరతులు, నిబంధనలకు లోబడి ఈ స్పెషల్ ఎలిజిబుల్ ప్లాన్లకు చెందిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 22దాకా ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నది. గతంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల పాలసీలను కొనసాగించలేకపోయిన కస్టమర్లకు ఇదో సువర్ణావకాశమని అభివర్ణించింది.
లేట్ ఫీపై రూ.3,000 వరకు తగ్గింపు
పాలసీ పునరుద్ధరణలో భాగంగా ఆలస్య రుసుము (లేట్ ఫీ)లు చెల్లించాల్సి ఉంటుందన్న ఎల్ఐసీ.. దీనిపై గరిష్ఠంగా రూ.3,000 వరకు రాయితీ కూడా కస్టమర్లకు లభిస్తుందని చెప్పింది. చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు లక్ష రూపాయల వరకుంటే లేట్ ఫీలో గరిష్ఠంగా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే లక్ష రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు ప్రీమియం బకాయిలుంటే రూ.2,500, రూ.3 లక్షలపైన చెల్లించాల్సి ఉంటే రూ.3,000 రాయితీ అందుకోవచ్చు. అయితే వైద్య అవసరాలపై రాయితీలుండవని చెప్పిన సంస్థ.. అర్హత ఉన్న ఆరోగ్య, మైక్రో-ఇన్సూరెన్స్ ప్లాన్లకూ లేట్ ఫీల్లో రాయితీ లభిస్తుందని తెలియజేసింది.
ఐపీవో కోసం 16 మర్చంట్ బ్యాంకర్లు
ఎల్ఐసీ ఐపీవో నిర్వహణ కోసం 16 మర్చంట్ బ్యాంకర్లు పోటీ పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు ఎల్ఐసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళ, బుధవారాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) ముందు బ్యాంకర్లు తమ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మంగళవారం బీఎన్పీ పరిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్, డీఎస్పీ మెర్రిల్ లించ్, గోల్డ్మన్ సాచ్స్, హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, నొమురా అంతర్జాతీయ సంస్థలు హాజరవుతున్నాయి. అలాగే బుధవారం యాక్సిస్ బ్యాంక్, డీఏఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఐఐఎఫ్ఎల్, జేఎం ఫైనాన్షియల్, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, యెస్ బ్యాంకింగ్ సంస్థలు వస్తాయి. గత నెల 15న మర్చంట్ బ్యాంకర్ల కోసం దీపం దరఖాస్తులను ఆహ్వానించగా, ఈ నెల 5తో ఆ గడువు ముగిసిపోయింది.