Diesel Demand | ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో డీజిల్ డిమాండ్ తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, క్లీన్ ఎనర్జీ వినియోగం పెరగడమే డీనికి ప్రధాన కారణం. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) విడుదల చేసిన తాత్కాలిక డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు) డీజిల్ వినియోగం కేవలం రెండుశాతమే పెరిగి 91.4 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 4.3శాతం, 2022-23లో 12.1శాతం కంటే తక్కువగానే ఉన్నది. భారతదేశంలో ఉపయోగించే చమురులో 40 శాతం డీజిల్‌దే. గత కొన్ని సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డీజిల్ వినియోగం తగ్గుతూ వస్తున్నది. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ వినియోగం తగ్గడానికి ప్రధాన కారణం ఎలక్ట్రికల్ వాహనాలే కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఈ-రిక్షాల వాడకం పెరిగింది. దాంతో పట్టణ ప్రజారవాణా వ్యవస్థలో డీజిల్ వినియోగం తగ్గుతూ వస్తున్నది. అలాగే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నాయి. పెట్రోల్ వినియోగం 7.5 శాతం పెరిగి 40 మిలియన్ టన్నులకు చేరగా.. ఎల్పీజీ డిమాండ్ 5.6 శాతం పెరిగి 31.32 మిలియన్ టన్నులకు చేరుకుంది. విమానయాన రంగంలో 2024-25లో జెట్ ఇంధన వినియోగం దాదాపు 9 శాతం పెరిగి దాదాపు 9 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. నాఫ్తాకు డిమాండ్ 4.8 శాతం తగ్గి 13.15 మిలియన్ టన్నులకు చేరుకోగా, ఇంధన చమురు వినియోగం దాదాపు ఒక శాతం తగ్గి 6.45 మిలియన్ చేరింది. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 5.4 శాతం తగ్గి 8.33 మిలియన్ టన్నులకు చేరుకుంది. పెట్రోలియం కోక్ డిమాండ్ 8.6 శాతం పెరిగింది. లూబ్రికెంట్స్, గ్రీజ్ డిమాండ్ 12.3 శాతం పెరిగింది.
మొత్తం మీద భారతదేశ పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 21 శాతం పెరిగి 239.171 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ వృద్ధి 2023-24లో 5 శాతం, గత ఏడాది 10.6 శాతం, 2021-22లో 3.8 శాతం కంటే తక్కువగా ఉన్నది. 2019-20, 2020-21 కొవిడ్ ప్రభావిత ఆర్థిక సంవత్సరాలను మినహాయిస్తే.. 2024-25లో చమురు వినియోగం దశాబ్దంలో తక్కువగా నమోదైంది. 2019-20-2020-21 ఆర్థిక సంవత్సరాల్లో కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలోని లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చమురు డిమాండ్ భారీగా తగ్గింది. ఇక ఏప్రిల్ 1తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ దాదాపు 253 మిలియన్ టన్నులకు 5.7 శాతం పెరుగుతుందని పీపీఏసీ అంచనా వేసింది. డీజిల్ వినియోగం 3 శాతం పెరిగి 94.1 మిలియన్ టన్నులకు, పెట్రోల్ వినియోగం 6.5 శాతం పెరిగి 42.63 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది.