SJM on Cryptos | దేశీయంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలను పూర్తిగా నిషేధించాలన్న భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రతిపాదనకు మద్దతు లభించింది. ఆర్బీఐ ప్రతిపాదనకు ఆరెస్సెస్ అనుబంధ స్వదేశీ జాగారణ్ మంచ్ జాతీయ కార్యవర్గం ఆదివారం ఓ తీర్మానం ఆమోదించింది. క్రిప్టో కరెన్సీ కాయిన్ల కొనుగోళ్లు, విక్రయాలు, పెట్టుబడులు పెట్టడంపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. అలాగే ఆర్బీఐ ఆధ్వర్యంలో తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు త్వరితగతిన ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని స్వదేశీ జాగారణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వినీ మహాజన్ కోరారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని లీగల్ క్రిప్టో కరెన్సీగా భావిస్తున్నారు.
క్రిప్టో కరెన్సీలపై నిషేధం అమల్లోకి తెచ్చాక కొద్దికాలం మాత్రమే క్రయ, విక్రయాలకు అనుమతించాలని స్వదేశీ జాగారణ్ మంచ్ వ్యాఖ్యానించింది. క్రిప్టో కరెన్సీలపై నిషేధాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థలపై పెనాల్టీ విధించాలని ఎస్జేఎం తీర్మానం పేర్కొంది. క్రిప్టో కరెన్సీలకు గుర్తింపు ఇవ్వడం వల్ల భారీ స్థాయిలో స్పెక్యులేషన్‌కు దారి తీస్తుందని తెలిపింది. ఫైనాన్సియల్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. క్రిప్టోలతో మనీ లాండరింగ్, ఉగ్ర వాదులకు ఫైనాన్సింగ్‌కు దారి తీస్తుందని హెచ్చరించింది. తెర వెనుక నుంచి క్యాపిటల్ కన్వర్టబిలిటీకి మార్గం సుగమం అవుతుందని తెలిపింది.