CIBIL Score | పర్సనల్ ఫైనాన్స్‌లో మూడంకెల క్రెడిట్ స్కోర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన దేశంలో వ్యక్తులు, కంపెనీల రుణ పరపతిని వారివారి రుణ చరిత్రల ఆధారంగా మదింపు చేయడంలో సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్) సమాచారాన్ని ప్రధానంగా రుణదాతలు (బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు) విశ్వసిస్తున్నారు. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్లను సిబిల్ ఇస్తున్నది. రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర రుణ సదుపాయాల కల్పనలో వ్యక్తులు, సంస్థల అర్హతను నిర్ధారించడంలో ఈ స్కోరే కీలకం. అధిక స్కోర్ రుణగ్రహీతల ఆర్థిక పరిపుష్ఠికి నిదర్శనంగా నిలుస్తుంది. దీంతో రుణాలు సులభంగా లభిస్తాయి. పైగా తక్కువ వడ్డీరేటుకే దొరుకుతాయి. అలాగే స్కోర్ తగ్గితే రుణ లభ్యత అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. వడ్డీరేట్లూ ఎక్కువగానే పడుతాయి. సిబిల్ స్కోర్ 750, అం తకన్నా ఎక్కువగా ఉంటే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను విరివిగా అందుకోవచ్చు. ఒకవేళ స్కోర్ 685 కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు రుణాలిచ్చేందుకు వెనుకాడుతాయి. కాబట్టి ఆకర్షణీయ సిబిల్ స్కోర్ కూడా ఆర్థిక లక్ష్యాల్లో ప్రధానమే.
సకాలంలో చెల్లింపులు
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల్లో సకాలంలో జరిపే చెల్లింపులు కీలకం. తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించడం, వాటి ఈఎంఐలను నిర్ణీత తేదీల్లో మిస్సవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. పేమెంట్లలో ఆలస్యం క్రెడిట్ స్కోర్‌ను వేగంగా తగ్గించడమేగాక, డిఫాల్టర్ (ఎగవేతదారు లేదా మొండి బకాయి)గా మార్చే ప్రమాదమూ ఉన్నది. దీనివల్ల భవిష్యత్తులో రుణ సదుపాయాలను అందుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు పొందడం పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది.
పరిమితంగా రుణాలు
రుణాలను పరిమితంగా తీసుకోవడమే ఉత్తమం. మనకున్న రుణ పరిమితిలో దాదాపు 30 శాతాన్ని మాత్రమే వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే క్రెడిట్ స్కోర్ బాగుంటుందని చెప్తున్నారు. సామర్థ్యానికి మించి ఉండే రుణ భారం వల్ల ఇబ్బందులు తప్పవు. కనుక అత్యవసరమైతే తప్ప రుణాల జోలికి వెళ్లకుండా ఉండటమే తెలివైన పని. అంతేగాక కీలకమైన గృహ రుణాల వంటి వాటికి అర్హత అనేది ఉంటుంది. కాబట్టి ప్రతీ చిన్న అవసరానికి అప్పులు చేయకుండా ఉండాలి.
అప్పుల అన్వేషణ వద్దు
కొత్త రుణాల కోసం తరచూ అన్వేషించడం కూడా మన క్రెడిట్ స్కోర్‌ను రిస్కులో పడేస్తుంది. రుణాల కోసం ఎక్కువగా వాకబు చేయడం వల్ల మన ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న సంకేతాలు క్రెడిట్ బ్యూరో సంస్థలకు వెళ్తాయి. దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నా.. లేకున్నా.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్దకు వెళ్లి రుణాల కోసం ప్రయత్నించకండి. దానివల్ల రుణదాతలు మీ రుణ చరిత్రను పరిశీలిస్తూ ఉంటారు. పదేపదే ఈ పని జరిగితే అది మీకే నష్టం.
పొరపాట్లను సరిచేయాలి
క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినప్పటికీ ఆ సమాచారం క్రెడిట్ బ్యూరోకు ఉండదు. దానివల్ల మన క్రెడిట్ స్కోర్ పెరగకుండా ఉంటుంది. అలాంటప్పుడు రుణదాత (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ)లను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది. ఇక ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఏజెన్సీలు ఉచితంగానే మనకు క్రెడిట్ స్కోర్‌ను తెలియజేస్తున్నాయి. కనుక తరచూ మన స్కోర్‌ను చెక్ చేసుకోవడం ఉత్తమం.
గ్యారంటీలకు దూరంగా..
గ్యారంటీలకు దూరంగా ఉండాలి. మనలో చాలామంది స్నేహితులనో, బంధువులనో, తెలిసినవారు లేదా ఇరుగుపొరుగువారంటూ వారి రుణాలకు పూచికత్తు సంతకాలు చేస్తూ ఉంటాం. కానీ ఇదంత శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ వారు తీసుకున్న రుణాలను చెల్లించకపోతే ఆ రుణ భారం మీ మీద పడుతుంది. ఆ రిస్కు పెరిగితే ఆటోమేటిగ్గా మీ క్రెడిట్ స్కోర్ సైతం క్షీణిస్తూ పోతుందన్న విషయం మరువద్దు. అందుకే తప్పని పరిస్థితుల్లో తప్ప వీలైనంత వరకు గ్యారంటీలకు దూరంగా ఉండాలి.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ను పెంచడంలో దోహదపడుతాయి. సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరి కాకుండా ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు మీరు చేసే డిపాజిట్ల ఆధారంగా లభిస్తాయి. పరిమిత రుణ చరిత్ర ఉన్నవారు, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారు వీటిని తీసుకొని మెరుగైన స్కోర్‌ను సాధించవచ్చు. మీరెంత నగదు డిపాజిట్ చేస్తే.. దానికి సమాన స్థాయిలోనే సదరు క్రెడిట్ కార్డు రుణ సదుపాయ పరిమితి ఉంటుంది. సకాలంలో కార్డు బిల్లులను చెల్లిస్తూపోతే స్కోర్ క్రమేణా పెరుగుతూపోతుంది.