హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ ఏర్పాటు ద్వారా ప్రపంచ తయారీరంగ ముఖచిత్రంలో తెలంగాణ రాష్ట్రం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొనేందుకు వీలు కలుగుతుందని ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ) చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లియూ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంపెనీ ఏర్పాటునకు శరవేగంగా మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్త విస్తరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో తెలంగాణ రాష్ర్టాన్ని ఎంపికచేసుకొన్నట్టు చెప్పారు. ఇక్కడి విస్తరమైన అవకాశాలను కంపెనీ ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.
తమ ప్రణాళికలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించినట్టు చెప్పారు. అన్ని విధాలా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చైనాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఇతర దేశాలకు తరలించాలని నిర్ణయానికి అనుగుణంగా ఈ యూనిట్‌ను తెలంగాణకు తరలించినట్లు చెప్పారు. ఈ ప్లాంట్‌లో ఎయిర్‌ప్యాడ్స్, ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నది.