Joint Home loans | కరోనా మహమ్మారి ప్రభావంతో సొంతిండ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. కొందరు డెవలపర్లు.. ఇండ్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ధరలు తగ్గిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఇండ్లు గల వారు తమపై రుణ వాయిదాల భారం తగ్గించుకోవడానికి ఆకర్షణీయ డిస్కౌంట్లతో ఇండ్ల రీసేల్కు మొగ్గుతున్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడంతో వేతనాల్లో కోత విధించినా.. కొన్ని సంస్థలు పొదుపు చర్యల పేరిట ఉద్యోగాల కోత విధించినా ఇండ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతున్నది.
చాలా మంది యువ ఇన్వెస్టర్లు తక్కువ ధరకే ఇండ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. ఇంటి రుణంతో ఆస్తులను కొనుగోలు చేయడానికి వారి వద్ద అవసరమైన ఆదాయం కూడా లేదు. హోంలోన్లలో వారి తల్లిదండ్రులు, సోదరులను ఉమ్మడి రుణ గ్రహీతలుగా చేరుస్తున్నారు. ఈ సర్దుబాట్లు మున్ముందుకు వివాదాలకు, సమస్యలకు దారి తీయొచ్చు. ఒకవేళ, సోదరులతో కలిసి ఉమ్మడిగా హోం లోన్ తీసుకోవాలని భావిస్తే లాభ నష్టాలు, ఇబ్బందులు, ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..
జాయింట్ హోంలోన్ తీసుకునే వారి ఆదాయాన్ని బట్టి రుణ అర్హత నిర్ణయిస్తాయి. సహరుణ గ్రహీత ఉండటం వల్ల రుణ వాయిదా చెల్లింపుల భారం తగ్గుతుందని బ్యాంకులు భావిస్తాయి. మీరు పెద్ద ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తే మీ అన్నదమ్ములతో కలిసి జాయింట్ లోన్ తీసుకోవడం సరైన చర్య. అలా కాకుండా వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఇంటి రుణం పొందడం ఆమోదయోగ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఉమ్మడి ఇంటి రుణం తీసుకున్నట్లయితే రుణ గ్రహీతలిద్దరూ ఒకే ఆస్తిపై పన్ను మినహాయింపులు వేర్వేరుగా పొందొచ్చు. ఆదాయం పన్ను చట్టం-1961లోని 24 (బీ) సెక్షన్ ప్రకారం ఒక్కో రుణ గ్రహీత.. ఇంటి రుణంపై వడ్డీ మీద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు అందుకోవచ్చు. ప్రిన్సిపల్ రీపేమెంట్ మొత్తంపై ఒక్కో రుణ గ్రహీత ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. నిర్మాణం పూర్తయిన ఇంటిపైనే క్లయిమ్ దాఖలు చేయొచ్చు.
ఒకవేళ ఉమ్మడి ఇంటి రుణం తీసుకున్న వారిలో ఒక సహయజమాని మరణిస్తే.. మిగతా యజమానికి ఆస్తిని బదిలీ చేయడం చాలా తేలిక. సాధారణంగా మరణించిన వ్యక్తి వారసులు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉమ్మడి యాజమాన్యం ఉంటే మిగతా వారి పేరుపై న్యాయవాది సమక్షంలో తాజా రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోతుంది.
రుణ వాయిదా చెల్లింపుల్లో ఒక రుణ గ్రహీత తన వాటా ఇవ్వకపోతే మరో యజమానిపై రుణ భారం పెరుగుతుంది. రుణ వాయిదా చెల్లింపులు డీఫాల్ట్ అయితే, ఇద్దరి క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. తద్వారా వారి రుణ పరపతిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భవిష్యత్లో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే సదరు ఇంటిపై ఆస్తి బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి ఉమ్మడి యజమానుల మధ్య వివాదం తలెత్తితే దాని విక్రయం ఇబ్బందికరంగా మారుతుంది. ఒకరు అంగీకరించకపోతే, మరొకరి భవిష్యత్ లక్ష్యాలు దెబ్బ తింటాయి.