ముంబై, ఆగస్టు 20: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాదారుల నగదు ఉపసంహరణ చార్జీలను సవరించబోతున్నది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం.. ఖాతాదారులు మొత్తంగా నెలకు నాలుగు నగదు ఉపసంహరణలనే ఉచితంగా పొందగలరు. ఆపై ప్రతి నగదు ఉపసంహరణకూ రూ.15 చొప్పున (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. కాగా, బీఎస్బీడీ ఖాతాదారులు తమ ఖాతాల్లో ఎటువంటి కనీస నగదు నిల్వలను ఉంచనక్కర్లేదన్న విషయం తెలిసిందే.
డిపాజిట్లు, ఉపసంహరణలు సహా కనీస బ్యాంకింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ బీఎస్బీడీ ఖాతాలను బ్యాంకులు అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్కు వీటికి సేవలు, లావాదేవీలు పరిమితుల్లో తేడాలుంటాయి.