సెప్టెంబర్ త్రైమాసికం కార్పొరేట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం.. అక్టోబర్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ గడువు ముగుస్తుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాల విక్రయానికి తెగబడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్ల సూచీలు భారీగా నష్టపోయాయి. ఏప్రిల్ 12 తర్వాత మార్కెట్లు అంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎ్చ్సంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1,159 పాయింట్లు పతనం అయితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ 354 పాయింట్లు కోల్పోయి 17,857 పాయింట్ల స్థిరపడింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 1,336 పాయింట్ల వరకు సెన్సెక్స్ పడిపోయి తిరిగి కోలుకున్నది. నిఫ్టీ 411 పాయింట్ల పతనమై తిరిగి కోలుకుని 354 పాయింట్ల వద్ద నిలిచింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి రూ.9,295.78 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
ఎన్ఎస్ఈలోని 15 సెక్టార్ల స్క్రిప్ట్‌లు అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఐదు శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.
ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 1.96, స్మాల్ క్యాప్ 1.85 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో కోల్ ఇండియా భారీగా 3.72 శాతం పతనమైంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ, టైటాన్, ఎన్టీపీసీ, హిందాల్కో, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎచిర్ మోటార్స్, విప్రో తదితర స్క్రిప్ట్‌లు 2-3.6 శాతం మధ్య పడిపోయాయి. బీఎస్ఈ-30లో 2,295 షేర్లు నెగెటివ్‌గా, 985 స్క్రిప్ట్‌లు లాభాలు గడించాయి.